YouTube channel subscription banner header

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ‘WeApp’ని రూపొందించిన టీడీపీ

Published on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటుపై ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రజా నాడి ప్రతిపక్ష టీడీపీ, దాని మిత్రపక్షాలకు కూడా అర్థ‌మైపోయింది. ఈ స్థితిలో ఓటర్లను తమవైపున‌కు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తున్న చివరి అస్త్రం ‘ఓటుకు నోటు’. ఇందుకోసం ‘WeApp’ అనే ఒక యాప్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించి, దాని ద్వారా బూత్ స్థాయి ఓటర్ల డేటాను సేకరిస్తూ వస్తోంది. ఎన్నికలకు ముందు ఉండే ‘సైలెన్స్ పీరియడ్’లో ఈ యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసేందుకు తెలుగుదేశం సిద్ధపడుతోంది.

‘WeApp’తో డేటా సేకరణ, ప్రలోభాలు

తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా రూపొందించిన ‘WeApp’ పబ్లిక్ డొమైన్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్స్, యాపిల్ యాప్ స్టోర్ లాంటి వాటిల్లో ఎక్కడా కనిపించదు. ఈ యాప్‌కి సంబంధించిన యాక్సెస్, దీని ద్వారా జరిగే రిజిస్ట్రేషన్స్ అన్నీ టీడీపీ జిల్లా కార్యాలయాలు లేదా కేంద్ర‌ కార్యాలయం నియంత్రణలో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీకి చెందిన బూత్ స్థాయి కన్వీనర్ల ఫోన్లలో ఈ యాప్‌ ఉండేలా టీడీపీ చూసుకుంది. ఈ యాప్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ (ఏపీకే ప్యాకేజీ)ని ‘[email protected]’ ద్వారా వారికి చేరవేసింది.

ఈ యాప్ ద్వారా టీడీపీ క్షేత్రస్థాయిలో ఓటరుకు సంబంధించిన ప్రతీ డేటాను సేకరిస్తోంది. ఓటరు పేరు, వయసు, లింగం, కులం, చిరునామా, రాజకీయపరమైన సంబంధాలు, ఫోన్ నంబర్, ఓటరు ఐడీ, బూత్ నంబర్స్ ఇలా సమస్త సమాచారాన్ని సేకరిస్తోంది. ఇలా సేకరించిన సమస్త సమాచారాన్ని ఓటరును ప్రలోభపెట్టేందుకు వాడుకుంటోంది.

ఈ యాప్ ద్వారా ప్రత్యేకమైన బార్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్స్‌ను జనరేట్ చేస్తున్నారు. అలా జనరేట్ అయిన స్లిప్‌పై ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటాయి. ఇలా బార్‌కోడ్‌తో కూడిన స్లిప్స్‌ను బూత్ స్థాయి కన్వీనర్లు ఓటర్లకు పంపిణీ చేస్తారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్ల స్పందన, అలాగే డబ్బు పంపిణీని మానిటర్ చేయడం పార్టీకి సులువు అవుతుంది. బార్‌కోడ్స్‌తో కూడిన ఓటర్ స్లిప్ అందిన ఓటర్లకు పార్టీ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు అందుతాయి. అంటే, ఓటును నోటుతో కొనే ప్రక్రియ అన్నమాట.

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు బేఖాతరు

ఎన్నికల వేళ టెక్నాలజీని ఉపయోగించుకుని టీడీపీ ఓటర్లను ప్రలోభపెడుతున్న తీరును వైసీపీ బహిర్గతం చేసింది. ‘WeApp’ ద్వారా టీడీపీ ఓటర్లను ప్రలోభపెడుతున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. యాప్ ద్వారా టీడీపీ చేస్తున్న అక్రమాలను, అనైతిక చర్యలను కళ్లకు కట్టినట్లు వివరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, ఐపీసీ సెక్షన్ 123 (1) ప్రకారం ఇలాంటి చర్యలను నేరంగా పరిగణలోకి తీసుకుంటామని ఈ నెల 2న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఫిర్యాదుతో జతపరిచింది. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు దీనిపై తక్షణమే స్పష్టమైన ఆదేశాలివ్వాలని, ‘WeAPP’ ఇన్‌స్టాల్ అయి ఉన్న ఫోన్లను తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ కోరింది. అప్పుడే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు ప్రలోభ పెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చునని పేర్కొంది. ఈ యాప్ ద్వారా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలకు బాధ్యులైన టీడీపీ సీనియర్ నాయకులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బూత్ స్థాయిలో దీన్ని ఈ కుయుక్తుల నిర్వహణకు సూత్రధారులైన బూత్ లెవల్ కోఆర్డినేటర్లపై, అలాగే ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...