నేరాలకు తెగబడటం.. హత్యలకూ వెనుకాడకపోవడం.. పగ, ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తూ.. బంగారం లాంటి జీవితాన్ని అంధకారం చేసుకుంటోంది నేటి యువత. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సరిగ్గా అలాంటి ఉదంతమే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కక్షగట్టి ప్రతీకారం కోసం ఎదురుచూసిన యువకులు అతన్ని హతమార్చి.. ఏకంగా దానిని సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే…
ఎస్ఆర్ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్(21) అలియాస్ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం విడుదలయ్యాడు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ప్రగతినగర్‌లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లింది.
దీంతో ఒంటరిగా ఉన్న తేజస్.. తన మిత్రులైన మహేశ్, శివప్ప, సమీర్‌తో కలిసి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్‌లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్రవాహనాలపై అక్కడికి వచ్చి తేజను కత్తులతో పొడిచి హతమార్చారు. అంతేకాదు.. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో తీసుకొని దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తమ పగ తీర్చుకున్నామని నిందితులు ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం. సమాచారం అందుకున్న కూకట్పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్ యాదవ్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.