విశాఖ జిల్లాలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడే తహసీల్దార్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. విశాఖ రూరల్ (చిన గదిలి) తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారమే ఆయన బొండపల్లి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి సాయంత్రం మధురవాడలోని కొమ్మాదిలో నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ చేరుకున్నారు.
రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ రావడంతో రమణయ్య అపార్ట్‌మెంట్ కిందకు వచ్చారు. గేట్ వద్ద మాస్కు ధరించిన వ్యక్తితో కొంతసేపు మాట్లాడటం సీసీ టీవీ ఫుటేజీలో నమోదయింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో తహసీల్దార్ తలపై దాడి చేశాడు. ఇది గమనించిన వాచ్ మెన్ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు చిక్కకుండా పారిపోయాడు.
వాచ్ మెన్ ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు రమణయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన రమణయ్య శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కాగా, రమణయ్య హత్యకి ల్యాండ్ మాఫియానే కారణమని ప్రచారం జరుగుతోంది. విశాఖ రూరల్ తహసీల్దారుగా నిజాయితీగా పనిచేసినందు వల్లే ల్యాండ్ మాఫియా ఆయన్ని హత్య చేసిందని స్థానికులు చెబుతున్నారు.
విశాఖ కలెక్టర్, సీపీ ఆసుపత్రికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కాగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల ముంగిట తహసీల్దార్ హత్యకు గురి కావడంతో రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.