నోటీసుల యాడ్స్‌కు అయ్యే ఖర్చును మార్గదర్శి సంస్థే భరించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. చందాదారుల వివరాల కోసం పత్రికల్లో విస్తృతంగా నోటీసులిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించింది. ఆ ప్రకటనలకు అయ్యే ఖర్చును మార్గదర్శి సంస్థే భరించాలని తెలిపింది. మొత్తం ఎంత ఖర్చవుతుందనే వివరాలను రిజిస్ట్రీ మార్గదర్శికి తెలియజేస్తుందని పేర్కొంది. ఆ మేరకు ఆ సొమ్మును అప్పటి నుంచి వారం లోగా డబ్బును డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గత విచారణలో రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని తెలిపింది. దీంతో పాటు చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్‌కు కూడా సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుల ధర్మాసనం ఆదేశించింది.