ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబే దారులు వేశారు. టీడీపీతో తాము పొత్తు పెట్టుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించినప్పుడు గ్రాఫ్ బాగానే ఉన్నట్లు కనిపించింది. కానీ చంద్రబాబు తన గోతిని తానే తవ్వుకున్నారనే మాట వినిస్తోంది. ఏపీలో వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా.. లేదా అనే సందేహాలు కలుగుతున్న సమయంలో చంద్రబాబు ఒక్కొక్కటిగా తప్పటడుగులు వేస్తూ వచ్చారు. వాటిలో మూడు ప్రధానమైన తప్పిదాలు ఉన్నాయి.
ఒకటి.. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు పెద్ద తప్పిదమే చేశారనే మాట వినిస్తోంది. రాష్ట్రంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల క్రైస్తవ, మైనారిటీలు జగన్‌కు దూరమవుతూ వచ్చారు. వారు టీడీపీకి మద్దతుగా నిలిచే సందర్భం వచ్చింది. కానీ చంద్రబాబు దాన్ని గుర్తించినట్లు లేదు. గుర్తించినా తనకున్న భయాల కొద్దీ భవిష్యత్తు ప్రమాదాలను పసిగట్టి రక్షణ కోసం బీజేపీతో పొత్తుకు తాపత్రయపడ్డారనే మాట వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత క్రైస్తవ, మైనారిటీలు ఆయనకు దూరమై జగన్‌కు దగ్గరయ్యారు. దానికితోడు ముస్లిం మైనారిటీలకు కూడా బీజేపీతో చంద్రబాబు పొత్తును భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో చంద్రబాబు మైనారిటీలకు పూర్తిగా దూరమయ్యారు.
రెండోది… ఎన్నారైలను చంద్రబాబు ఎక్కువ నమ్ముకోవడం కూడా కొంప ముంచేట్లు ఉంది. దాదాపు 36 మంది ఎన్నారైలకు ఆయన అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. ప్రథమ శ్రేణి నాయకులను పక్కన పెట్టి మరీ ఎన్నారైలకు టికెట్లు ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక నాయకులు ఇద్దరేసి పోటీపడిన స్థానాల్లో కూడా ఆయన ఎన్నారై అభ్యర్థులను రంగంలోకి దించారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు స్థానిక నాయకులు సహకరించని పరిస్థితి ఏర్పడింది. దానికితోడు టీడీపీ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను కించపరచడం కూడా టీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఎన్నారైలు డబ్బుతో ఓటర్లను కొంటారనే ఉద్దేశంతో చంద్రబాబు వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు జయరాం మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
మూడోది… జగన్‌పై దాడి విషయంలో చంద్రబాబు నాలుక మడతపెట్టిన తీరు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దుర్గారావు ఎన్ని కథలు చెప్పుతున్నప్పటికీ జగన్‌పై టీడీపీ దాడి చేయించిందనే బలమైన అభిప్రాయం ప్రజల్లో నాటుకుంది. ప్రధాన నిందితుడు సతీష్ కుమార్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. జగన్ సానుభూతి కోసం తానే దాడి చేయించుకున్నారని చంద్రబాబుతో సహా ఇతర టీడీపీ నాయకులు చెప్పుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారు. నిందితుడు పట్టుబడిన తర్వాత మాట మారుస్తూ వచ్చారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నమ్మించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఇది టీడీపికి కలిసి రాకపోగా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి.