జనసేన గాజు గ్లాసు గుర్తులో అంతా గందరగోళం.. అయోమయం ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో జనసేన గుర్తును ఫ్రీ జోన్లో ఉంచడం, దానికితోడుగా గాజు గ్లాసు గుర్తుకు సమాంతరంగా బక్కెట్ గుర్తుతో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పోటీలోకి దిగడంతో జనసేన అభ్యర్థులకు కలవరం మొదలైంది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పోటీలో ఇద్దరు పవన్ కళ్యాణ్‌లు, మచిలీపట్నం లోక్‌సభ బరిలో ఇద్దరు బాలశౌరిలు, తెనాలి అసెంబ్లీకి ఇద్దరు మనోహర్లు పోటీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి కొత్త చిక్కులు వస్తున్నాయి.
పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తుతో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగడంతో జనసేన శ్రేణులకు దిక్కుతోచడం లేదు. ఓటర్లు పొరపాటున గ్లాసుకు బదులు బకెట్‌కు ఓట్లేసే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. గాజు గ్లాసు, బక్కెట్ గుర్తులు రెండూ సరిసమానంగా పోలి ఉండటమే ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య. దీని నుంచి ఎలా బయటపడాలనీ ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని జనసేనను మూడు ప్రధాన సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకటి ఆ పార్టీ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ జోన్లో ఉంచడం. రెండోది ఆ పార్టీ గాజు గ్లాజు గుర్తును పోలిన నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బకెట్ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగడం. మూడోది జనసేన పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లతోనే సరిసమానంగా నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లనూ ప్రకటించడం.
అసలే ఎన్డీఏతో పొత్తుల కారణంగా జనసేన ఆశించిన దానికంటే అతి తక్కువగా 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లనే కూటమి నుంచి సాధించింది. జనసేనకు 50 నుంచి 60 సీట్లు వస్తాయని, అధికారంలో భాగస్వామ్యం వుంటుందని, పవన్ కల్యాణ్‌కు రెండున్నరేళ్ల కాలం ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందన్న కథనాలు వచ్చాయి. కూటమి పొత్తులతో జనసేనకు తగిననన్ని సీట్లు రాకపోవడంతో వరుస వారీగా ఆ పార్టీని నేతలు వీడుతున్నారు. ఎక్కడైతే పవన్ కు సొంత సామాజిక బలం వుందన్న ఆశతో టీడీపీ, బీజేపీ పొత్తులకు దిగాయో, అక్కడే పూర్తిగా ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వరుసగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో పవన్ కల్యాణ్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. తుదకు ఆయన పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీకి సైతం అక్కడి టీడీపీ నేత వర్మపైనే అన్ని ఆశలు పెట్టుకోవడం పవన్ బలహీనమైన నాయకత్వానికి అద్దం పడుతున్నదన్న విమర్శలున్నాయి.
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి… రెండుచోట్లా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలలోనైనా ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయబోమని పొత్తులకు దిగగా, ఆయన పోటీ చేసే స్థానంపైనే గెలుపు ధీమా లేకుండా పోయింది. ఇప్పుడు జనసేన గుర్తును పోలిన బకెట్ ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. మరోవైపు పార్టీ గుర్తును ఫ్రీ జోన్లో వుంచడమూ అభ్యర్థులకు నిద్రలేకుండా చేస్తోంది.
జనసేన పార్టీని కేవలం రిజిస్టర్ పార్టీగానే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. గుర్తింపు పొందిన పార్టీల జాబితాలోకి జనసేన చేరలేదు. ఈ ఎన్నికల్లో జనసేన గుర్తును రద్దు చేయాలంటూ నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. జనసేనకే ఆ పార్టీ గాజుగ్లాసు గుర్తును హైకోర్టు కేటాయించింది. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. జనసేన కేవలం రిజిస్టర్ పార్టీగానే వున్నందున ఆ పార్టీ గాజుగ్లాసు గుర్తు ఫ్రీ జోన్ కేటగిరిలోకి వెళ్తున్నది. దీని ప్రకారం జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ (మచిలీపట్నం, కాకినాడ) స్థానాల వరకే ఈ గాజుగ్లాసు గుర్తు పరిమితమవుతుంది. మిగిలిన లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే గాజుగ్లాసు గుర్తును ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు ఎంచుకోవచ్చు.
ఎన్డీఏ కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. జనసేన పోటీ చేయకుండా ఆ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న టీడీపీ, ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు కోరవచ్చు. అదే జరిగితే.. జనసేన పార్టీ శ్రేణుల్లో కొందరికి పొత్తులపై సరిగ్గా అవగాహన లేక, గాజుగ్లాసు గుర్తు అంటే జనసేనగా భావించి, ఆ స్వతంత్ర అభ్యర్థికి ఓట్లు వేయవచ్చు. బయట బ్యానర్లు, ఫ్లెక్సీలలో గాజుగ్లాసు గుర్తు చిన్నదిగా, బకెట్టు గుర్తు పెద్దదిగానూ వుంటాయి. ఈవీఎంలలో మాత్రం గాజుగ్లాసు గుర్తు, బకెట్ గుర్తు సరిపోలి ముద్రించి వుంటాయి. దీంతోపాటు జనసేన ప్రకటించిన అభ్యర్థుల పేర్లకు సమానంగా, నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే పేర్లతో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటర్లు పొరపాటున ఆ పేర్ల ఆధారంగా గాజుగ్లాసుకు వేయబోయి… బకెట్ గుర్తుకు ఈవీఎం మీటలపై ఓట్లు నొక్కే అవకాశాలున్నాయి.
ఇప్పటికే తమను పోటీ నుంచి విరమించాలంటూ నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జనసేన నుంచి బెదిరింపులు వచ్చాయని, బెదిరింపులపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనకు ముప్పేట గండం నెలకొంది. గాజుగ్లాసుకు ఫ్రీ జోన్ ఇవ్వడం, గ్లాసు గుర్తుకు సమానంగా గుర్తు రావడం, జనసేన అభ్యర్థులు ప్రకటించిన పేర్లతోనే నవరంగ్ నేషనల్ అభ్యర్థులూ పోటీ చేయడం వెరసి జనసేన గుర్తు గందరగోళంగా మారింది.