టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగే సమయాన్ని తగ్గించేందుకు కేంద్రం నూతన విధానం తీసుకొస్తోంది. ఇప్పటికే దీనిపై చాలాసార్లు కేంద్ర మంత్రులు, అధికారులు హింటిచ్చారు. ఎట్టకేలకు దీనిపై ముందడుగు పడింది. శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ గా దీన్ని పిలుస్తున్నారు. కేంద్ర రవాణా శాఖ.. తాజాగా దీన్ని నోటిఫై చేసింది. జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు- 2008 ని సవరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఇకపై టోల్ గేట్ల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారిత టోల్ వసూలు విధానం అమలులోకి వస్తుంది. ముందుగా ప్రధాన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై దీన్ని అమలు చేస్తారు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలవుతుంది.
ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీలు అదనంగా ఈ GNSS విధానం అమలులోకి వస్తుంది. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌తో ఉన్న ఆన్ బోర్డు యూనిట్ (OBU) కలిగిన వాహనాలకు ఈ విధానంలో టోల్ వసూలు చేస్తారు. ఆ వాహనాలు టోల్ గేట్ ద్వారా వెళ్తే.. టోల్ రహదాలపై అవి ప్రయాణించిన దూరాన్ని లెక్కగట్టి ఫీజు వసూలు చేస్తారు. ఈ ఫీజు చెల్లింపు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఈ OBU వాహనాలకు ప్రత్యేక లైన్‌లు ఉంటాయి. నావిగేషన్ డివైజ్ లేని వాహనాలకు మాత్రం ఇప్పుడున్న పద్ధతినే ఫాలో అవుతారు.
ఇక కొత్తగా 20 కిలోమీటర్ల వరకు జీరో టోల్ కారిడార్‌ను తీసుకొచ్చారు. అంటే నేషనల్ హైవే ఎక్కిన తర్వాత 20 కిలోమీటర్లు దాటాక వచ్చే టోల్ గేట్ లకే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ లోపు వచ్చే లోట్ గేట్లలో చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకు మించి ప్రయాణిస్తే మాత్రం దూరానికి తగ్గట్లు టోల్ వసూలు చేస్తారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ లో ఈ పాయింట్ ని పెట్టినా.. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కొత్త విధానంలో అన్ని వాహనాలకు OBU అమర్చుకోవాలా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇది ప్రయాణికులకు లాభదాయకమా, లేక టోల్ సంస్థలకు దీనివల్ల లాభం ఉంటుందా అనేది కూడా మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.