వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిమజ్జనం సందర్భంగా సిటీలోకి భారీ వాహనాలను అనుమతించడం లేదని, వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కోరారు. ఈ నిమజ్జన ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రేటర్లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రేపు ఉదయం నుంచి మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ప్రయాణం సౌకర్యార్థం ప్రజలు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను విస్తృతంగా వాడుకోవాలని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించామని, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.
నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఖైరతాబాద్ గణేష్, సాయంత్రం 4 గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరుగుతుందన్నారు. శోభాయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామని విశ్వప్రసాద్ వెల్లడించారు.