మలయాళ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇండస్ట్రీలోని హీరోయిన్స్‌కు ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటకు వచ్చి చెప్తున్నారు. దీంతో మలయాళీ చిత్ర పరిశ్రమపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హేమ కమిటీ రిపోర్టుతో అసోసియేషన్ ఆఫ్ మలయాళీ మూవీ ఆర్టిస్ట్ – AMMA అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేశారు. సభ్యులు సైతం రాజీనామాలు సమర్పించారు. ఇప్పుడు జస్టిస్ హేమ తరహా కమిటీని దక్షిణాదిలో ఉన్న ఇతర చిత్రపరిశ్రమల్లోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల నడిగర్ సంఘం తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కన్నడనాట సైతం ఇదే డిమాండ్ వినిపిస్తోంది.
ఇక టాలీవుడ్‌లోనూ ఈ తరహా కమిటీ ఏర్పాటు చేయాలని హీరోయిన్ సమంతతో పాటు పలువురు నటీమణులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్‌లో పనిచేస్తున్న మహిళల సేఫ్టీ కోసం, వారికోసం ప్రాతినిథ్యం వహించేందుకు ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.
మంచు విష్ణు ట్వీట్ ఇదే –
మా అధ్యక్షుడిగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రికి.. నాదొక విజ్ఞప్తి. టాలీవుడ్‌లో..మహిళలకు రక్షణ, ప్రాతినిథ్యం మరింత మెరుగుపడేలా మనం చూసుకోవాలి. ఇందుకోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. కెమెరా ముందే కాకుండా, కెమెరా వెనుక కూడా..మహిళలకు అనుకూల వాతావరణం కల్పించడం మన బాధ్యత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిరంతరం మెరుగుపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇందుకోసం పరిశ్రమలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాం అంటూ విష్ణు ట్వీట్ చేశారు. ఈ పోస్టు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో నిజంగానే కమిటీ ఏర్పాటు చేస్తే.. ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.