ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క చేతితో తీసుకుని మరో చేతితో పంచిపెడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి తీసుకున్న సొమ్మునే ప్రజలకు ఇస్తున్నారనేది వారి ప్రచారం. అంటే సంక్షేమ పథకాల పేరు మీద ఇస్తున్నది మీ సొమ్మేనని వాళ్లు ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం. అయితే, ఏ పాలకుడైనా ఏం చేస్తాడు, వివిధ రూపాల్లో నిధులు సమకూర్చుకుని వాటిని ప్రజలకు మేలు జరిగేలా ఖర్చు చేస్తాడు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం జేబులోంచి ఇస్తారా? అదేం కాదు. ఆయన మాత్రం హెరిటేజ్ లాభాలను పంచిపెడుతారా? హెరిటేజ్‌కు ఎంత లాభం వచ్చినా ప్రజలకు ఇవ్వరు కదా.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని శ్రీలంక, వెనిజులా చేస్తున్నారని జగన్ మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు తను ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే ఆలోచన చేయాలి. ఆయన ఇస్తున్న హామీలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? దాదాపుగా రూ.1.5 లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? తన ఇంటి సొమ్మునేం ఇవ్వరు. హామీల అమలుకు తాను ఎక్కడి నుంచి నిధులు తెస్తాననే విషయాన్ని చెప్పారా?
2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎగనామం పెట్టారు. కొన్ని హామీలను తూతూ మంత్రంగా అమలు చేశారు. ప్రజల నుంచి వివిధ రూపాల్లో రాబట్టిన సొమ్మును చంద్రబాబు తన మనుషులకు పంచిపెట్టాడనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు పెట్టిన బాకీలను కూడా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చాడు జగన్. అలాగే సంక్షేమ పథకాల అమలులో పైరవీలకు, లంచాలకు తావు లేకుండా చూశారు. పైగా, లబ్ధిదారుల ఇళ్లకే చేరవేస్తున్నారు.