టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వలంటీర్ల భయం పట్టుకుంది. వారి ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలకు ఎసరు పెట్టేందుకు చంద్రబాబు చాలా కాలంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో వారినే ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు మాజీ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా దాన్ని సాధించానని ఆయన అనుకోవచ్చు. కానీ అది ఆయనకే ఎదురు తిరుగుతుంది. ఎన్నికలు ముగిసే వరకు వలంటీర్లను తమ విధులకు దూరంగా ఉంచాలని ఎన్నిక సంఘం ఆదేశించింది. వారి వద్ద ఉన్న సిమ్ కార్లులను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
వలంటీర్లకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల కమిషన్‌కు వారిపై ఫిర్యాదు చేశారు. ఏ జెండాను పట్టుకుని వచ్చినా ఆయన చంద్రబాబు ఏజెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. మూటలు మోసే ఉద్యోగాలు చేసేవారని, మహిళలను ఇబ్బంది పెట్టేవారని చంద్రబాబు వలంటీర్లను అవమానించారు. వారిని కిడ్నాపర్లుగా, మనుషుల అక్రమ రవాణాలకు పాల్పడేవారిగా, వారు ఎంతో మంది అమ్మాయిలను మాయం చేసేవారిగా చెప్పుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషం కక్కారు. ఈనాడు రామోజీరావు వలంటీర్లకు వ్యతిరేకంగా వార్తాకథనాలను రాయించారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు వెనక్కి తగ్గి వలంటీర్లకు హామీల వర్షం కురిపించారు. వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, యాభై వేలు సంపాదించుకునేవారిగా వారిని తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. కానీ, చంద్రబాబును వాళ్లు నమ్మే పరిస్థితి లేదు.
నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు చేసిన కుట్ర వల్ల రెండు నెలల పాటు ప్రజలకు వలంటీర్ల సేవలు అందుబాటులో ఉండవు. వలంటీర్లకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఇంత స్వల్ప వ్యవధిలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. దానివల్ల ప్రజలకు సేవలు అందవని, దాంతో ప్రజలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమవుతారని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. కానీ అది ఆయనకే ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. వృద్ధులకు పెన్షన్లు, పేద ప్రజలకు ఇతర ప్రయోజనాలు అందకపోవడం అనేది చంద్రబాబు నిర్వాకం వల్లనే అని ప్రజలు గ్రహించలేని స్థితిలో లేరు. గ్రామ సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు ఇబ్బందులు పడతారు.
ప్రభుత్వ విధుల నుంచి బయటకు వచ్చే వలంటీర్లు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు పోతాయనే అభద్రతకు గురవుతారు. దానివల్ల వారు వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను పట్టుకుని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉంది. తమకు అందే ప్రయోజనాల గురించి ప్రజలు వారిని అడిగినప్పుడు జరిగిన మోసాన్ని వారు ప్రజలకు చెప్తారు. దానివల్ల కూటమికి ప్రజలు ఎదురు తిరిగే అవకాశం ఉంది.