తమ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామాపై వైసీపీ స్పందించింది. ఇదంతా చంద్రబాబు కుట్రేనని, ఎన్ని కుతంత్రాలు పన్నినా వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని స్పష్టం చేసింది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని, బాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం కావాలని, అదే వైఎస్ జగన్ గెలవాలంటే జనం సాయం ఉంటే చాలాన్నారు పేర్ని. ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలేస్తుందన్నారు. జగన్ తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు.
టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్‌లు జగన్‌కి అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని పేర్ని నాని సవాల్ చేశారు. కేవలం జగన్ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని గుర్తు చేశారు. ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారని, ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు.
ప్రజలిచ్చిన అధికారాన్ని నిత్యం తమపై బురద చల్లేందుకు కూటమి ప్రభుత్వం ఉపయోగిస్తుందన్నారు. తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్ చేశారని, దేశంలోని పలు రాష్ట్రాల్లో అభియోగాలు ఎదుర్కొంటూ, కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకొచ్చి, ఇక్కడ అనేక మంది ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందన్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్‌ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్ ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్ర అని పేర్ని నాని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు.