వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా ధ్రువీకరించింది. మోపిదేవి వెంకట రమణతో వైసీపీకి చెందిన మరో ఎంపీ రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో చంద్రబాబు భేటీ అయ్యారని, బాబుతో అంతా మాట్లాడుకొని సెట్ చేసుకున్నాకే పార్టీ మార్పుపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం, రేపల్లెలో తన అనుచరులతో సమావేశం తరువాత వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మోపిదేవి రాజీనామా చేస్తారని సమాచారం. వచ్చే నెల 6వ తేదీన మోపిదేవి వెంకట రమణ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారట. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినప్పటికీ వైఎస్ జగన్ ఆయనకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన తొలి కేబినెట్‌లో మోపిదేవికి మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు మోపిదేవి. అయితే పార్టీ మార్పు అంశంపై మోపిదేవి వెంకట రమణ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వైసీపీ అధికారం కోల్పోయి తరువాత పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. రావెల కిషోర్‌తో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇలా చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.