మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య పోటీ చేస్తున్న తుని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. యనమల సోదరుడు, ఆయన విజయంలో కీలక సూత్రధారిగా ఉంటూ వస్తున్న యనమల కృష్ణుడు పార్టీకి రాజీనామా చేశారు. యనమల తరఫున నియోజకవర్గంలో రాజకీయం నడిపించే కృష్ణుడి రాజీనామాతో అక్కడ టీడీపీకి రానున్న ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది.
కృష్ణుడే కీలకం
యనమల రామకృష్ణుడు టీడీపీ ప్రభుత్వంలో పలు దఫాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. యనమల రాజధానిలో ఉంటే తునిలో ప్రచారం చేసేది, గెలిపించేది కృష్ణుడే. అయితే 2014లో రామకృష్ణుణ్ని మండలి నుంచి ఎంపిక చేసిన చంద్రబాబు అక్కడ కృష్ణుడికి టికెటిచ్చారు. అప్పుడు, 2019లో కూడా కృష్ణుడు ఓడిపోయారు.
కుమార్తె కోసం తమ్ముడిని పక్కనపెట్టారు
ఈసారి తన కుమార్తె దివ్యకు టీడీపీ టికెట్ ఇవ్వాలని రామకృష్ణుడు మంత్రాంగం నడిపారు. చంద్రబాబును ఒప్పించి బిడ్డకు టికెట్ ఖాయం చేసుకున్నారు. ఈ క్రమంలో తమ్ముణ్ని పక్కనపెట్టారు. దివ్యకు టికెట్ వచ్చాక టీడీపీలో అసంతృప్తులందరినీ కలిసి మాట్లాడిన రామకృష్ణుడు కీలకమైన కృష్ణుడిని మాత్రం సంప్రదించలేదు. పార్టీలో టికెట్ దక్కక, ఇటు కుటుంబంలోనూ గౌరవం లేక ఇబ్బంది పడుతున్న కృష్ణుడు రాజీనామాతో కలకలం రేపారు.
వైసీపీకి కలిసొస్తుందా?
తునిలో యనమల అంటే గుర్తొచ్చేది కృష్ణుడే. ఆయనే పార్టీ వదిలివెళ్లిపోతే ఆయన వర్గంకూడా టీడీపీకి దూరమవుతుంది. అధికార పార్టీ ఊపును తట్టుకుని దివ్య గెలవాలంటే కృష్ణుడి పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఆయన రాజీనామాతో వైసీపీకి మరింత ప్లస్ అయ్యే పరిస్థితులున్నాయి. ఒకవేళ కృష్ణుడు వైసీపీలో చేరితే ఇక వైసీపీ గెలుపు మరింత సులువు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.