గతంలో ఏ వాలంటీర్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేశారో, అదే వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ప్రభుత్వానికి దిక్కైంది. సహాయక చర్యల్లో వాలంటీర్ వ్యవస్థను వినియోగించుకుంటోంది కూటమి ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్, వాటర్, ఇతర సామగ్రి అందిస్తున్నారు వాలంటీర్లు. సహాయక చర్యల్లో పాల్గొనని వాలంటీర్లను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది ప్రభుత్వం.
ఐతే వరద ప్రభావిత ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను వినియోగించుకోవడంపై వైసీపీ స్పందించింది. ఎవరినైనా వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే వాళ్లను పట్టించుకోవడం మానేశారని ట్వీట్ చేసింది. రెవెన్యూ, MRO, కలెక్టర్లు ఉండగా.. అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకని గతంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశ్నించారని గుర్తుచేసింది. ఇప్పుడు అవసరం రాగానే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నారని, ముంపు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో వాలంటీర్ల అవసరం ఏర్పడడంతో వారి జపం చేస్తున్నారంది. వైఎస్ జగన్ విజన్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తెలుసుకుంటే బావుంటుందని స్పష్టం చేసింది వైసీపీ.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 60 వేల మందిని వాలంటీర్లుగా నియమించింది. వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో వాలంటీర్లు కీ రోల్ ప్లే చేసేవారు. గతంలో వాలంటీర్ వ్యవస్థపై ఎన్నో ఆరోపణలు చేశారు చంద్రబాబు. సంచులు మోసే ఉద్యోగం అంటూ చిన్న చూపు చూశారు. ఒంటరి మహిళలపై దాడులు చేస్తున్నారంటూ కించపరిచేలా మాట్లాడారు. తీరా ఎన్నికలకు ముందు నాలుక మడతేసి రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామంటూ వాలంటీర్లకు హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అటకెక్కించారు. ఇప్పుడు మళ్లీ వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లతో పనులు చేయించుకుంటూ.. తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారు.