ఓ అయిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపల్లెనా, వీధివీధినా మోగిన, మార్మోగిన పాట మీకు గుర్తుందిగా..! అదే, రావాలి జగన్, కావాలి జగన్! మన జగన్.. ఆ పాట అఖిలాంధ్ర జనాన్ని ఊగించింది. టీవీల్లో, ఎన్నికల వేదికల మీద, రోడ్ల మీద, అందరి ఇళ్లల్లోనూ అదే పాట. ఆ పాట ట్యూన్, ఆ రిథం అలా పట్టుకుంది జనాన్ని. పాట చాలా తేలికైన పదాలతో సింపుల్‌గా ఉండాలి. జనం గుండెల్లోకి దూసుకుపోవాలి. అందరూ పాడుకోగలిగేలా ఆ రిథం మనసుని అల్లుకుపోవాలి. ఒకనాడు బుర్రకథ నాజర్, సుబ్బరావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు ఇలాంటి ప్రజల పాటల్ని పాడి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు, అంటే 2024లో వైసీపీ వాళ్లు వొదిలిన ఒక పాట దుమ్మురేపుతోంది.
నల్లగొండ గద్దర్‌గా పేరుపొందిన ఒక యువకుడు ఆ పాట రాశాడు.. పాడాడు.
‘‘జెండాలు జతకట్టడమే మీ ఎజెండా
జనం గుండెలో గుడికట్టడమే జగన్ అజెండా..!’’
అనే పాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా మోగుతోంది
చెప్పినమాట చెప్పినట్టుగా
చేసిన మా రాజన్న కొడుకురా జగను
ఏ కష్టం రావద్దని పేద గుండెకు
ప్రతి పథకం పంపిండురా గడపగడపకూ!
పులి కడుపున పులి పుట్టినట్టే పుట్టిండురా
భళిరా భళి భళిరా భళిరా
పులివెందులలో పుట్టిందా పులిరా..!
కుర్చీలో కూర్చోవడమే మీ ఎజెండా..
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ అజెండా
అనే ఆ పాట చరణాలు జనం పదే పదే పాడుకుంటున్నారు. పాడుతూ, ఆడుతూ ఉత్సాహంతో ఊగిపోతున్నారు.
భళిరా భళి భళిరా భళిరా..!
పేద బతుకులు మార్చిన సీమపులిరా..
భయమెరుగని ఆ ప్రేమకు హడలు
అసలు వంచబోడు ఎవరికీ మెడలు
ఆయన ఎదురుగ కొడుతున్నరు తొడలు..!
వేసుకుంటరురా తప్పక జడలు
పేదోడి కంచంలో నాలుగు మెతుకుల కోసం
ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచెరా యుద్ధం
సీమ పౌరుషం పక్కనబెట్టిండురా పేదల కోసం..!
అని ఎంతో ఎఫెక్టివ్‌గా పాడాడు. నల్లగొండ గద్దర్. ఆ గొంతు సూటిగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోతోంది.
రైతు కూలన్నల చేతి కర్ర మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్నాడురా జగను
మీ పొత్తులకు, కుట్రలకు లొంగడు జగను
నీ జెండానే మా భుజమున మోస్తం
ఎవడొస్తాడో నీ ఎదురుగ చూస్తాం
వైసీపీ జెండానే ఎగరేస్తాం..!
అని జనరంజకంగా ముగుస్తుందీ వైసీపీ ఎన్నికల ప్రచార గీతం.
ఎన్నికల సభల్లో, బస్సు యాత్ర పొడవునా, జిల్లాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, వీధుల్లో ఉద్వేగభరితమైన ఈ గీతం జనాన్ని ఉర్రూతలూగిస్తోంది. కేవలం జనాన్ని మెప్పించడమే కాదు, గాయకుడు ఒక ఫోర్స్‌తో పాడిన తీరు రాష్ట్రమంతా ఒక మూడ్ క్రియేట్ చేస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ విజయపథంలో ముందుకు దూసుకుపోతోందన్న ఒక గట్టి నమ్మకాన్నీ, భరోసానీ ఇస్తోంది.
లక్షలాది జనం జగన్ మాటల్ని ఎంత శ్రద్ధగా వింటున్నారో, ఈ విజయ గీతాన్నీ అంతే నిబద్ధతతో పాడుకుంటున్నారు. శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఈ పాట, వైసీపీ శ్రేణుల్ని కదం తొక్కిస్తోంది.