గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టులను వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి రేపు ఉదయం మంగళగిరికి తీసుకువస్తారని సమాచారం.
2021 అక్టోబర్ 19న తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. ఐతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టీడీపీ.. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్ సహా పలువురిని నిందితులుగా చేర్చింది. ఐతే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామన్న అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది.
బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఇదే అదునుగా అరెస్టులను స్పీడప్ చేసింది ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. సురేష్‌కు రెండు వారాల రిమాండ్ విధించింది కోర్టు. 2014 నుంచి టీడీపీ తనను టార్గెట్ చేసిందన్న నందిగం సురేష్.. అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు.