బాపట్ల మేదరమెట్లలో జరిగిన సిద్ధం బహిరంగసభ సూపర్ సక్సెస్ అయ్యిందనటంలో సందేహంలేదు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు చెప్పుకుంటే పట్టిచుంకోవక్కర్లేదు. కాని ఈ విషయాన్ని స్వయంగా ఎల్లో మీడియానే అంగీకరించింది. ‘రాజకీయ సభా.. ఈవెంట్ మేనేజ్మెంటా’ ? అనే హెడ్డింగ్ పెట్టి మరీ పే…ద్ద స్టోరీ అచ్చేసింది. అందులో బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న ఏడుపు స్పష్టంగా కనబడింది. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయ్, సిద్ధం సభలకు తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగం అవుతోందని నానా గోల చేసింది.
భీమిలి, ఏలూరు, రాప్తాడు, మేదరమెట్లలో జరిగిన నాలుగు సిద్ధం బహిరంగసభలు ఒకదాన్ని మరోటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు నిర్వహించటం సాధ్యంకాదని తేలిపోయింది. ఎందుకంటే టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటిసభ ఫెయిలైంది. రెండు పార్టీలు కలిసినా జనాలు హాజరుకాలేదంటే ఇకముందు కూడా జనాలు హాజరయ్యేది అనుమానమే. ఎందుకంటే బహిరంగసభ నిర్వహణలో బీజేపీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కూటమి సభలకు జనాలు వస్తే పవన్ లేదా తమ్ముళ్ళ మేనేజ్మెంట్ వల్లే రావాలి.
ఈ విషయమే ఎల్లో మీడియాను బాగా కలవరపెట్టేస్తున్నట్లుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు జనాలు పోటెత్తుతుంటే మరోవైపు కూటమి సభలు వెలవెలాపోతున్నాయి. అందుకనే సభల నిర్వహణకు వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని, ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలిస్తోందని, విద్యాసంస్థల యాజమాన్యాల నుండి బస్సులను తీసుకుంటోందని, వందల కోట్లు ఖర్చు చేస్తోందనే పనికిమాలిన ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిందిదే. అప్పట్లో బస్సుల్లో జనాలను తరలించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు కూడా చెల్లించలేదు. కానీ ఇపుడు జగన్ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది.
జగన్ ర్యాంపు వాక్ చేయటాన్ని కూడా ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. బహిరంగసభల్లో కొత్తదనం కోసం ప్రయోగాత్మకంగా జగన్ ర్యాంప్ వాక్ మొదలుపెట్టారు. బహిరంగసభలో మాట్లాడేసి వెళ్ళిపోకుండా బహిరంగసభ తర్వాత జనాల మధ్యలో నిర్మించిన భారీ ర్యాంపు మూడు వైపులా జగన్ నడుస్తున్నారు. ఈ ప్రయోగం బాగా సక్సెస్ అవ్వటం కూడా ఎల్లో మీడియా ఏడుపుకు కారణమైంది. అందుకనే బహిరంగ సభ ఫెయిలైందని రాయలేక అధికార దుర్వినియోగమని, ర్యాంప్ వాక్ చేయటం ఏమిటని, ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారని పిచ్చి ఆరోపణలు చేస్తోంది.