ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర ట్వీట్ వేశారు. గతంలో తండ్రి పుట్టినరోజు, వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో సందేశాలు ఉంచే జగన్.. ఈసారి మాత్రం ‘వుయ్ మిస్ యు డాడ్’ అంటూ, ఆయన లేని లోటుని గుర్తు చేసుకుంటూ ట్వీట్ పెట్టారు. తల్లి విజయమ్మతో కలసి వైఎస్ఆర్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించారు.
https://x.com/ysjagan/status/1830444354969710646
వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లిన జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు రోజుల క్రితమే జగన్ పులివెందులకు వెళ్లారు. తొలిరోజు వైసీపీ నేతలను పరామర్శించారు, కొత్త దంపతులను ఆశీర్వదించారు. పులివెందులలోనే ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామని, మళ్లీ మంచి రోజులొస్తాయని ఆయన వారికి సూచించారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, కలిసికట్టుగా అందరం ముందుకెళ్లాల్సిన అవసరముందని చెప్పారు. ప్రతి కార్యకర్తకు తనతోపాటు, వైసీపీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్.
మూడురోజుల పర్యటన అనంతరం నేడు జగన్ తాడేపల్లికి తిరిగి వస్తారు. విజయవాడ వరదలపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించే అవకాశముంది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బాధితులకు అండగా నిలవాలని జగన్ కూడా పిలుపునిచ్చారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత జగన్ బాధితులను పరామర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో తమ హయాంలో కట్టిన రిటైనింగ్ వాల్, విజయవాడకు భారీ నష్టం జరగకుండా ఆపిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.