ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దాదాపు అన్ని వర్గాలు లాభపడ్డాయి. అయితే అక్రమ సంపాదనతో లబ్ధిపొందిన కొంతమంది మాత్రం జగన్ పథకాలతో ఇబ్బంది పడ్డారు. పేదలు, మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరగడంతో ముఖ్యంగా ఏపీలో మూడు వర్గాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వారంతా సీఎం జగన్ కి వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ అయ్యారు. జగన్ మళ్లీ గెలిస్తే తమ వ్యాపారాలు పూర్తి స్థాయిలో మూతపడతాయని వారు భయపడుతున్నారు.
వడ్డీ వ్యాపారులు..
గతంలో వ్యవసాయ పనులకోసం రైతులు అప్పులకోసం వెళ్లేవారు, జగన్ వచ్చాక రైతు భరోసాతో వారికి కాస్తో కూస్తో ఆ అవసరం తప్పింది. గతంలో స్కూల్స్ మొదలవుతున్నాయంటే, పిల్లల పుస్తకాలు, బ్యాగ్ లు, బట్టలకోసం కూడా అప్పులు చేసే కుటుంబాలున్నాయి. కానీ జగన్ వచ్చాక అమ్మఒడితోపాటు విద్యా కానుక కిట్ లతో ఆ అవసరం లేకుండా పోయింది. నేతన్న నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలు, ఆటో డ్రైవర్లు, టైలర్లకు ఇస్తున్న ఆర్థిక సాయం.. ఇతరత్రా పథకాలతో చాలామంది వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్లడం మానేశారు. ఒకరకంగా జగన్ సంక్షేమ పథకాలన్నీ ఆ వర్గం ఉపాధిని దెబ్బతీశాయనే చెప్పాలి. ప్రత్యేకించి టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వడ్డీ వ్యాపారులకు జగన్ అందుకే టార్గెట్ అయ్యారు.
ప్రైవేట్ స్కూల్స్..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్లు భారీగా పడిపోయాయి. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడంతో చాలావరకు కాన్వెంట్ చదువులు ఆగిపోయాయి. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడంతో ప్రభుత్వ స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా మారిపోయాయి. కార్పొరేట్ విద్యా వ్యాపారం దారుణంగా దెబ్బతినడంతో ఆ బిజినెస్ ని నమ్ముకుని ఇన్నాళ్లూ కోట్లు గడించిన విద్యా వ్యాపారులు జగన్ కి వ్యతిరేకంగా మారారు. తమ ఉనికికోసం వారు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులు..
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల దందా కూడా క్రమక్రమంగా తగ్గిపోయింది. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయడం, వివిధ రకాల జబ్బులను ఆ పథకంలో చేర్చడం ద్వారా చాలామంది నిరుపేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉపయోగించుకుంటూ కార్పొరేట్ వైద్యం అందుకున్నారు. దీంతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల అడ్డగోలు దోపిడీ ఆగిపోయింది. వారంతా ఇప్పుడు జగన్ పై కక్షగట్టారు. ఆరోగ్య శ్రీ పరిమితిని తాజాగా రూ. 25లక్షలకు పెంచడంతో కార్పొరేట్ ఆస్పత్రులకు మరింత కంటగింపుగా మారింది. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే, మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటే తమ పరిస్థితి ఏంటా అని ఆలోచనలో పడ్డాయి కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు. అందుకే వారంతా టీడీపీకి సపోర్ట్ చేయడం మొదలుపట్టారు.
పదే పదే సీఎం జగన్ తన ప్రసంగాల్లో చెబుతున్నట్టు ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. జగన్ పథకాలతో మేలు జరిగింది అట్టడుగు వర్గాల పేదలకు, మధ్యతరగతి వారికి. ఆ పథకాలతో ఆయా వర్గాలు లాభపడటంతో కొంతమంది కార్పొరేట్ శక్తుల అక్రమార్జనకు అడ్డుకట్ట పడినట్టయింది. ఆ పెత్తందార్లే చంద్రబాబుతో కలసి జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. కానీ లబ్ధిదారులంతా ఏకమైతే, పేదల ఓట్లన్నీ వన్ సైడ్ గా వైసీపీకి పడితే, కార్పొరేట్ శక్తులు జగన్ కి వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలన్నీ విఫలం కావడం గ్యారెంటీ.