అనుకోకుండా ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంతటి కష్టాల్లో పడుతుందో ఊహించడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన చేసి వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.
పథకం వివరాలు
ఈ పథకాన్ని 2020 అక్టోబర్ 22న ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 18-70 సంవత్సరాల వయస్సు గల వారికి వర్తిస్తుంది. ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత అంగవైకల్యం సందర్భాల్లో ఆర్థిక సాయం అందిస్తారు. ప్రాణం కోల్పోయిన వ్యక్తి కుటుంబంలో నామినీకి డబ్బు అందజేస్తారు.
ప్రమాద మరణం సంభవిస్తే.. మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తారు. 18-70 సంవత్సరాల మధ్య సహజ మరణం పొందితే రూ.1 లక్ష వరకు అందిస్తారు. ఇక అంత్యక్రియల ఖర్చలుకు సైతం రూ.పది వేలు అందిస్తారు.
ఉదాహరణకు ఒక్క కడప జిల్లానే తీసుకుంటే.. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్ బీమా పథకం కింద సహజ మరణాలు 572 నమోదయ్యాయి. అందులో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 481 కుటుంబాలకు మొత్తం రూ.4.81 కోట్లు బీమా సొమ్ము అందింది. వివిధ ప్రమాదాల్లో 111 మంది మరణించగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 85 మందికి రూ.4.25 కోట్ల నగదు అందింది.
వైఎస్సార్ బీమా పథకం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఓ భరోసాగా నిలిచింది. ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబ దిక్కును కోల్పోయినా ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ పథకం అండగా నిలుస్తోంది.