“ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన విద్యాదీవెన జనవరి నుండి ఇప్పటివరకు మూడు విడతలు పెండింగ్ లో ఉంది. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యా దీవెన సొమ్ము తల్లుల ఖాతాల్లో, విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేసేవాళ్ళం ” నిన్న గుంటూరు జైలు వద్ద జగన్ చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన ఇవ్వట్లేదు. అమ్మఒడికి తల్లికి వందనం అని పేరు మార్చారే కానీ డబ్బులు జమ కాలేదు. నేతన్న నేస్తం లాంటి పథకాల ఊసే లేదు. మరి ఇవన్నీ రాకపోతే కనీసం జనం నుంచి స్పందన రావాలి కదా, ఎంతసేపు జగన్, వైసీపీ నేతలే వీటిపై ప్రశ్నించాలా..? జనం సైలెంట్ గానే ఉంటారా..?
https://x.com/YSRCParty/status/1833902866911941083
ఇక్కడ టీడీపీ ఓ లాజిక్ చెబుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలప్పుడు హామీలిచ్చిన నవరత్నాల పథకాలు ప్రారంభించేందుకు కనీసం 6 నెలలు టైమ్ తీసుకున్నారని, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా కొన్ని పథకాలు మొదలుపెట్టలేదని తేదీలతో సహా లెక్కలు చెబుతున్నారు టీడీపీ నేతలు. వైసీపీ అంత టైమ్ తీసుకున్నప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే అన్నీ చేయమంటే ఎలా అని నిలదీస్తున్నారు. కనీసం జగన్ కి ఇచ్చిన టైమ్ అయినా తమకి ఇవ్వరా అని లాజిక్ తీస్తున్నారు.
టీడీపీ లాజిక్ కి వైసీపీ నుంచి సమాధానం లేదు. మేమిచ్చాం, ఇస్తున్నాం, అధికారం మారగానే అవన్నీ ఆగిపోయాయి, సమాధానం చెప్పండి అని మాత్రమే వారు ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ ప్రశ్నల్ని జనం సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా అనేదే అసలు పాయింట్. ఇప్పటి వరకు ప్రజలెవరూ తమకు తల్లికి వందనం కావాలని రోడ్డెక్కలేదు, తమకు విద్యా దీవెన లేట్ అయిందని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సంగతేంటని ఎవరూ నిరసనలకు దిగలేదు. కనీసం వైసీపీ అయినా ప్రజల్లో కదలిక తెస్తుందనుకుంటే ఆ ప్రయత్నం చేయడంలేదు కానీ, నేతలు ప్రెస్ మీట్లలో మాత్రమే వీటిని ప్రస్తావిస్తున్నారు. సూపర్ సిక్స్ అమలుని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందనే విమర్శలున్నాయి. వైట్ పేపర్లు విడుదల చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందంటూ ఆల్రడీ సీఎం చంద్రబాబు ప్రజలకు హింటిచ్చేశారు. నిదానంగా అన్ని పథకాలు అమలు చేస్తామని సింపతీ డైలాగులు కొట్టారు. ఈ దశలో ప్రజలు కూడా నిరసనలు, ఆందోళనలు చేస్తారని, సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందేనని పట్టుబడతారనుకోలేం. వైసీపీ కూడా బలమైన వ్యూహ రచనతో బయటకు వస్తేనే ప్రజల మద్దతు కూడగట్టే అవకాశం ఉంది.