- కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ
- ఒకే రోజు రెండుసార్లు ఫోన్లో మాట్లాడిన సీఎం
- వరుస తుఫాన్లతో రాష్ట్రానికి భారీగా నష్టం
- తుఫాన్ల ప్రభావం, పంట, ఆస్తి నష్టం, సహాయక చర్యల గురించి వెల్లడి
అమరావతి, నవంబరు 3: అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రజలకు కలిగిన ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. మురసు తుఫాను ప్రభావం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాను పరిస్థితులు, జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ఒకే రోజు రెండుసార్లు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి, వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రానికి ఎదురైన నష్టాన్ని వివరించారు. అర్నబ్ తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుఫాను కారణంగా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని సీఎం వివరించారు.
రూ.343.95 కోట్ల మేర ప్రాథమిక నష్టం
మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఎనిమిది శాఖలకు సంబంధించి ప్రాథమికంగా సుమారు రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయ రంగంలోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని, 69,828 మంది రైతులు ప్రభావితమయ్యారని వివరించారు. వీటిలో 45,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాథమికంగా రూ.324.22 కోట్ల నష్టం అంచనా వేసినట్లు తెలిపారు. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉందని, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, అత్యవసర కార్యకలాపాల కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల కోసం 11 ఎస్డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేశామని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో 480 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 12,230 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు.
కేంద్ర బృందం పర్యటన పై కృతజ్ఞతలు
తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్, సాగునీటి వనరులకు జరిగిన నష్టంపై సమగ్రంగా అంచనాలు రూపొందించి పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించారు. వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కేంద్రం అవసరమైన సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించే ప్రక్రియను పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే చేపడతామని సీఎం తన లేఖలో పేర్కొన్నారు.