ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎగువ నుంచి వరద నీటితో కృష్ణానది ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతిన్నాయి. బ్యారేజ్‌పై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. కృష్ణలంక వాసులను కలుసుకొని మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని, ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా మా జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు.
12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారు. కృష్ణలంక ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కల్పించడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు.
విజయవాడలో వరద బాధిత ప్రాంతాలను వైఎస్ జగన్ నేడు పరిశీలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ సింగ్‌నగర్ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.