చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో కొందరిపై నానా రచ్చ జరుగుతోంది. గోదావరి జిల్లాల తమ్ముళ్ళ అంచనా ప్రకారం ప్రకటించిన 94 మంది అభ్యర్థులో 40 మంది అభ్యర్థుల గెలుపు అనుమానమేనేట. ఎలాగంటే 94 మంది అభ్యర్థుల్లో లోకేష్ కోటాలో ఓ 25 మంది వరకు ఉన్నారట. వీరిలో పీ గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళున్నారట. రాజేష్‌ను మార్చకపోతే ఓడిపోవటం ఖాయమని తమ్ముళ్ళే గగ్గోలు పెట్టేస్తున్నారట. రాజేష్ మీద పార్టీ నేతలేకాదు మామూలు జనాలు కూడా మండిపోతున్నారు.
రాజేష్‌ను మార్చకపోతే మండపేట, కొత్తపేట, అమలాపురంలో తామంతా కూడా ఓడిపోవటం ఖాయమని అభ్యర్థులు నెత్తినోరు మొత్తుకుంటున్నారట. రాజేష్‌కు లోకేష్ కోటాలో టికెట్ ఎలాగ వచ్చిందో అర్థంకావటంలేదని తమ్ముళ్ళే షాక్ తిన్నారు. ఇలాంటి అభ్యర్థులు ఇంకా 25 మందున్నారట. వీళ్ళల్లో అత్యధికులు ఓడిపోవటం ఖాయమని గోదావరి తమ్ముళ్ళ మధ్య చర్చలు పెరిగిపోతున్నాయి. అలాగే వీళ్ళ ప్రభావం మరో 15 నియోజకవర్గాల మీద కూడా పడటం ఖాయమని తమ్ముళ్ళే అంటున్నారు.
టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటును రెండు రకాలుగా చూడాలి. మొదటిదేమో జనసేనకు బలమున్న నియోజకవర్గాలను చంద్రబాబు తీసేసుకున్నారు. పీ గన్నవరం, పిఠాపురం, రాజమండ్రి రూరల్, విజయవాడ తూర్పు, తణుకు, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం లాంటివాటిని చంద్రబాబు తీసేసుకున్నారు. అలాగే రెండో కోణమేమిటంటే టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని అనుకున్న వాటిని జనసేనకు ఇచ్చేశారట. అయితే జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలు ఏవన్న విషయం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
తణుకు, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పీ గన్నవరం, నిడదవోల్లాంటి నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే రేపటి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనకంటు ప్రత్యేకంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న లోకేష్ సీనియర్లందరినీ తొక్కేసినట్లు తమ్ముళ్ళే మండిపోతున్నారు. తన వర్గానికి టికెట్లు ఇప్పించుకోవాలన్న ఆతృతలో చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డున్న రాజేష్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల నుండి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అభ్యర్థులను మార్చాలని ఫిర్యాదులు అందుతున్నాయట. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.