రాబోయే ఎన్నికల్లో వలంటీర్ల వల్ల తమకు నష్టం జరుగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)లో భయం మొదలైనట్లుంది. వలంటీర్ల(volunteers)తో పెట్టుకుంటే నష్టపోతామని చంద్రబాబునాయుడు చెప్పినట్లున్నారు. అందుకనే సడెన్‌గా వలంటీర్లపై యూటర్న్ తీసుకున్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ వలంటీర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వలంటీర్లలో కొందరి వల్లే వ్యవస్థకు చెడ్డ పేరొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 32 వేలమంది మహిళలు అదృశ్యమవ్వటానికి వలంటీర్లే కారణమని తాను ఎప్పుడూ అనలేదని మాట మార్చారు.
తాను అనని మాటలను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించి వలంటీర్లలో తనపైన వ్యతిరేకత భావన వచ్చేలా చేశారని మండిపడ్డారు. 32 వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారని అందుకు వలంటీర్లే కారణమని పవన్ స్పష్టంగా ఆరోపించారు. పవన్ ఆరోపణలపై వలంటీర్లు కోర్టులో కేసులు కూడా వేశారు. మాట అనేసి తర్వాత తాను అనలేదని బుకాయిస్తే కుదరదు. ఎందుకంటే ఎవరేమి మాట్లాడినా ఆడియో, వీడియోల్లో స్పష్టంగా రికార్డయిపోతోంది. కాబట్టి తన మాటల వల్ల జరిగిన, జరగబోయే డ్యామేజికి భయపడి పవన్ ఎంత సమర్థించుకున్నా ఉపయోగం ఉండదు.
రాబోయే ఎన్నికల్లో వలంటీర్లే టీడీపీ కొంప ముంచేస్తారని ఒకవైపు చంద్రబాబు, ఎల్లో మీడియాకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పుడు వీళ్ళకి పవన్ కూడా తోడైనట్లున్నారు. తాను చెప్పిన మహిళల అదృశ్యాన్ని మొదట జగన్‌తో పాటు జనాలు నమ్మకపోయినా తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో నమ్మినట్లు పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. మహిళల మిస్సింగ్‌కు, హ్యమూన్ ట్రాఫికింగ్‌కు పవన్‌కు తేడా తెలీకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
32 వేలమంది మహిళలు అదృశ్యమైనట్లు పవన్ చెప్పలేదు. 32 వేలమంది హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురైనట్లు ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మహిళలు, అమ్మాయిలు, బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపటం. అదృశ్యమవ్వటానికి కారణాలు చాలా ఉంటాయి. పరీక్షల్లో ఫెయిలవ్వటం, ఇష్టంలేని పెళ్ళి, ప్రేమ లాంటి అనేక కారణాలతో ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. అమ్మాయిలు కనబడలేదనగానే తల్లిదండ్రులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇస్తారు.
అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ పోలీసులకు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకనే మిస్సింగ్ కంప్లైంట్ అలాగే ఉండిపోతుంది. దీన్ని అర్థం చేసుకోలేని పవన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని బహిరంగసభలో ఆరోపించారు. దాంతోనే వలంటీర్లకు పవన్‌పై మండిపోయింది. తాజా పరిణామాలతో వలంటీర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏదేదో కవర్ చేస్తున్నారు.