జనసేన పార్టీని పెట్టినప్పుడు అధినేత పవన్ కల్యాణ్ రెండు కారణాలు చెప్పారు. మొదటిదేమో ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానని, రెండో కారణం ఏమిటంటే.. జనాలకు కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేద్దామని. రోజులు గడిచేకొద్దీ తేలిందేమిటంటే రెండూ అబద్ధాలే అని. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ తన రాజకీయమంతా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించటంతోనే సరిపోతోంది. జగన్‌ను మాత్రమే తాను ప్రశ్నిస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. ఇదే సమయంలో తనను మాత్రం ఎవరు ప్రశ్నించేందుకు లేదని స్పష్టంగానే చెప్పేశారు.
టీడీపీతో పొత్తు విషయంలో అనుమానాలను వ్యక్తంచేసిన నేతలను ఉద్దేశించి తాను చెప్పినట్లు వినదలచుకుంటే పార్టీలో ఉండాలని లేకపోతే పార్టీని వదిలేసి వైసీపీలో చేరమని స్పష్టంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీతో పొత్తు ఉద్దేశ్యాన్ని, లాభనష్టాల గురించి పవన్‌ను కొందరు నేతలు ప్రశ్నించారు. వారికి సమాధానం చెప్పలేకో, లేకపోతే ఇవ్వటం ఇష్టంలేకో, ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండని చెప్పేశారు. అంటే తనను నేతలు ప్రశ్నించటాన్ని పవన్ తట్టుకోలేకపోయారు. కాబట్టి ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పింది అబద్ధమని తేలిపోయింది.
ఇక తాజాగా భీమవరంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బులు పంచితే కానీ, గెలవలేమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు ఖర్చుచేయాల్సిందే అన్నారు. ఓట్లను కొంటారా లేదా అన్నది నేతలిష్టమన్నారు. అందరూ ఎన్నికల్లో కోట్లరూపాయలు ఖర్చు చేస్తుంటే తాను మాత్రం డబ్బు ప్రభావంపై మాట్లాడకూడదంటే ఎలాగని నేతలను పవన్ ఎదురు ప్రశ్నించారు. డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయమని తాను ఎవరికీ చెప్పలేదన్నారు.
పవన్ చెప్పిన తాజా మాటల ప్రకారం జనాలకు కొత్తతరహా రాజకీయాన్ని పరిచయం చేయబోయేది కూడా శుద్ధ అబద్ధమే అని తేలిపోయింది. మిగిలిన పార్టీల్లాగే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసేట్లయితే ఇక కొత్తతరహా రాజకీయాన్ని చూపించేదేముంది..? పైగా తాను కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అవుతానని ప్రకటించారు. కులాలు, మతాల వారీగా ఓటర్లను విడదీస్తున్నారని జగన్ మీద పడి ఇంతకాలం ఏడుస్తున్న పవన్.. ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నట్లు తనంతట తానే ప్రకటించారు. ఇక పవన్ చెప్పిన కొత్తతరహా రాజకీయమేముందో అర్థంకావటంలేదు.