మధ్యంతర భృతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళం పాడేసిందని ఎల్లో మీడియా ఏడుపు మొదలుపెట్టింది. ఈ ఏడుపుతోనే ఉద్యోగులను, పెన్షనర్లను రెచ్చగొడుతోంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి, ఉద్యోగుల సంఘాలకు జరుగుతున్న చర్చలు కాబట్టి వీలైనంతగా ఉద్యోగులందరినీ రెచ్చగొట్టడమే పనిగా ఎల్లో మీడియా పెట్టుకుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతి ఐదేళ్ళకు పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయాలి. ఆ పీఆర్సీ రిపోర్టును కమిటీ జూన్‌లో ప్రభుత్వానికి ఇస్తుంది. దానిపై ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు కొంత సమయం తీసుకుంటుంది.
జీతాల పెంచే విషయంలో కమిటీ సిఫారసు చేసిన పర్సంటేజిని ప్రభుత్వం ఎప్పుడూ యథాతథంగా అమలు చేయదు. అందుకనే ఉద్యోగులతో బేరసారాలకు దిగుతుంది. ఇది సమయం పట్టే విషయం కాబట్టి పీఆర్సీ పర్సెంటేజి ఫైనల్ అయ్యేంత వరకు మధ్యే మార్గంగా మధ్యంతర భృతి(ఐఆర్)ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. చర్చల్లో ఫైనల్ అయిన పర్సెంటేజీకి అప్పటికే అమలవుతున్న ఐఆర్‌ను కలుపుతారు. మామూలుగా జరిగే ప్రక్రియే ఇది. ఎన్నికల తేదీకి పీఆర్సీ నివేదిక అమలుకు గతంలో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. కాబట్టి ఉద్యోగుల సంఘాల నేతలతో చర్చలు జరిపేది ప్రభుత్వం.
కానీ ఇప్పుడేమో సరిగ్గా ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిటీ రిపోర్టంటున్నారు. వాస్తవానికి పీఆర్సీని అమలు చేయాల్సింది జూన్ నెలలో. ఎన్నికలేమో ఏప్రిల్‌లో జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే పీఆర్సీ అమలు తేదీ కన్నా ముందే కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది. అందుకనే ప్రభుత్వం ఐఆర్ ఎందుకు డైరెక్టుగా పీఆర్సీనే అమలు చేస్తామని చెబుతోంది. మంత్రుల మాటల్లో మళ్ళీ తామే అధికారంలోకి రాబోతున్నామనే విశ్వాసం కనబడుతోంది. అయితే సంఘాల నేతలేమో ఇప్పుడే ఐఆర్ ప్రకటించాలని పట్టుబడుతున్నారు.
వీళ్ళ అనుమానం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏమో? వచ్చే ప్రభుత్వం పీఆర్సీ అమలుకు, ఐఆర్ అమలుకు ఎంతకాలం తీసుకుంటుందో అనే ఆందోళన కనబడుతోంది. నిజానికి డైరెక్టుగా పీఆర్సీనే అమలు చేస్తున్నపుడు ఇక ఐఆర్‌తో పనేముందన్న మంత్రుల వాదనలో లాజిక్ ఉంది. పీఆర్సీ రిపోర్టు అమలులో ఆలస్యమయ్యేటప్పుడు మాత్రమే ఐఆర్‌ను ప్రభుత్వం అమలు చేస్తుంది. పైగా పీఆర్సీ సిఫారసుకు అమలుకు ఇంకా నాలుగు నెలల సమయముంది. ఇప్పటినుండే ఎందుకు దీనిపైన మాట్లాడుతున్నారని మంత్రులు అడుగుతున్నారు. రెండు వైపుల వాదనలో లాజిక్కుంది. ఇంతలోనే ఎల్లోమీడియా ఎంటరైపోయి ఉద్యోగులను రెచ్చగొట్టేస్తోంది.