ఈ సారి ఎన్నికల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయి. టీడీపీ, జనసేనల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అందుకే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. విజయం కోసం పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనను తోడు తెచ్చుకున్నారు. బీజేపీతో పొత్తుకు సాగిలపడుతున్నారు.
చంద్రబాబుకి ఇప్పటికే వయస్సు మించిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో రెండు సార్లు దెబ్బ తిన్న చంద్రబాబు ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతిలో 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జగన్ చేతిలో ఈసారి ఓడిపోతే చంద్రబాబు లెక్క సరిపోతుంది. అయితే, ఈసారి ఓటమి పాలైతే క్రియాశీలక రాజకీయాలు చేసేందుకు ఆయన వయస్సు సహకరించకపోవచ్చు. వచ్చే ఏప్రిల్‌లో ఆయన వయస్సు 74 ఏళ్లకు చేరుతుంది. వచ్చే ఎన్నికల నాటికి, అంటే 2029 ఎన్నికల నాటికి 79వ పడిలోకి చేరుకుంటారు. ఆ వయస్సులో రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం సాధ్యం కాదు.
అందుకే ఆయన నారా లోకేష్‌ను నాయకుడిగా తయారు చేయాలని చూస్తున్నారు. కానీ ఆయన చంద్రబాబును అందుకునేట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ఎందులోనూ సాటి రావడం లేదు. జగన్‌ను ఎదుర్కునే సత్తా ఆయనకు లేదు. దాంతో ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ప్రస్తుతం కేవలం 24 సీట్లకు పోటీ చేస్తున్న జనసేన ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎన్ని సీట్లు సాధించినా దాని మనుగడ కష్టమే.
పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేయడంపై గత పదేళ్ల పాటు పెద్దగా దృష్టి సారించలేదు. మధ్య మధ్యలో బ్రేక్‌లు తీసుకుంటూ ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజల వద్దకు వచ్చి ఆయన దూకుడుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రసంగాల్లో పస ఉండడం లేదు. జనసేన పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఇప్పటికి కూడా రూపుదిద్దుకోలేదు. భవిష్యత్తులో స్థిరమైన రాజకీయ పార్టీగా మారుతుందనేది కూడా సందేహమే.
ఈ స్థితిలో తిరిగి వైఎస్ జగన్ విజయం సాధిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తి స్థాయిలో శాసిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఆ పార్టీకి ఎదురు అనేది లేకుండా పోతుంది.