ఉత్తరాంధ్రలోని కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో అనకాపల్లి కూడా ఒకటి. ఇక్కడ నుండి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టికెట్‌కు ఢోకా లేదు కాబట్టి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒకటికి రెండుసార్లు లోకల్ నేతలతో సమీక్షలు నిర్వహించారు. పార్టీ తరపున సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. పోటీకి అంతా సిద్ధంచేసుకున్న నాగబాబు ఇక నామినేషన్ వేయటం ఒకటే మిగిలిందన్నట్లుగా హడావుడి చేస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో నాగబాబు స్పీడుకు పవనే బ్రేకులు వేసినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు కాబట్టి తొందరపడ్డదని సోదరుడికి పవన్ చెప్పారట. దాంతో గడచిన నాలుగు రోజులుగా నాగబాబు పార్టీ కార్యక్రమాలకు ఫులుస్టాప్ పెట్టేశారు. విషయం ఏమిటంటే వైజాగ్ సిటీకి సంబంధించి ఈ మధ్యనే సుందరపు సతీష్ అనే వ్యక్తి పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే పార్టీలో చేరారు. బాగా డబ్బుండటంతో పవన్+నాగబాబుతో తొందరగానే స్నేహం ఏర్పడిందట. దాన్ని అడ్డం పెట్టుకుని తాను టికెట్లిప్పిస్తానని సతీష్ మరికొందరికి హామీలిచ్చి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
మొన్నటి అభ్యర్థుల ప్రకటనలో టికెట్లు వచ్చేస్తాయని కొందరు నేతలు అనుకున్నారు. అయితే అయిదు నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించిన పవన్ 19 నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టేశారు. ఈ ఐదింటిలో కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో లోకం మాధవికి పవన్ టికెట్టిచ్చారు. దాంతో సతీష్ విషయంలో గోల మొదలైందట. ఎందుకంటే నెల్లిమర్లలో టికెట్ ఇప్పిస్తానని కూడా డబ్బులు వసూలు చేశారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ విషయాలన్నీ పవన్ దృష్టికి వచ్చాయట. విషయాన్ని ఆరాతీస్తే సదరు నేత తనతో పాటు నాగబాబుతో సన్నిహితంగా ఉంటున్న విషయం బయటపడింది.
తామిద్దరితో సన్నిహితంగా ఉంటున్న కారణంగా పోటీ చేయాలని ఆశించిన చాలా మంది టికెట్ల కోసం సతీష్‌ను అప్రోచ్ అయినట్లు అర్థమైందట. అందుకనే వెంటనే అతనిని కట్ చేసేశారట. దాంతో నాగబాబు స్పీడుకు కూడా బ్రేకులు పడ్డాయి. అందుకనే నాలుగు రోజులుగా నాగబాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో యాక్టివ్‌గా కనబడటంలేదని సమాచారం. మరి పరిస్థితులు అనుకూలంగా లేవని పవన్ చెప్పటంలో అర్థమేంటో జనసేన నేతలకు తెలియటం లేదు.