సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న బీజేపీ ఆశావహులతో కేంద్ర పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ భేటీలు ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు 2 వేల దరఖాస్తులు అందాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అంటే సగటున ఒక్కో స్థానానికి 10 మంది పైనే. అధికార పార్టీ వైసీపీలోగానీ, విపక్షాలైన టీడీపీ, జనసేనలో కూడా టికెట్ల కోసం ఇంత రద్దీ లేదు. మరి బీజేపీకి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయంటే.. నిజంగా ఏపీలో ఆ పార్టీకి అంత సీనుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లూ కష్టమే
2014లో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లిన బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ ఓట్లు, జనసేనకు ఆకర్షితులైన యువత ఓట్లు కలిసి ఆ నాలుగు చోట్లయినా గట్టెక్కగలిగారు తప్ప బీజేపీ సొంత బలం కాదు. 2019లో మళ్లీ విడిగా పోటీ చేసేసరికి కమలదళం బలమెంతో తేలిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోలయిన మొత్తం ఓట్లు 3 కోట్ల 14 లక్షల పైచిలుకు. ఇందులో బీజేపీకి దక్కింది జస్ట్ 2 లక్షల 64 వేల ఓట్లు. నోటాకు నాలుగు లక్షలకు పైగా ఓట్లొచ్చాయి. అంటే ఏపీలో కమలనాథుల పరిస్థితి నోటా కంటే దారుణం. డిపాజిట్లు కూడా దక్కని దైన్యం.
మరి ఎందుకింత హంగామా?
గట్టిగా మాట్లాడితే వార్డు మెంబర్గా, పంచాయతీ సర్పంచిగా కూడా బీజేపీ అభ్యర్థులు గెలవలేని పరిస్థితి ఏపీలో ఉంది. మరి అలాంటప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎందుకున్ని వేల అప్లికేషన్లు వస్తున్నాయి? సమాధానం చాలా సింపుల్. టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటే 15, 20 సీట్లన్నా ఇస్తారు. వాళ్ల ఓట్లతో గెలిచేయవచ్చన్న ఆశ. ఒకవేళ పొత్తు లేకపోయినా పార్టీ అభ్యర్థిగా నిలబెడితే జనంలోనూ ఓ గుర్తింపు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏవైనా నామినేటెడ్ పదవులు వచ్చే ఛాన్స్ ఉంటుందనే ఆశ. ఏం.. కాలేజీలో పాఠాలు చెప్పిన కంభంపాటి హరిబాబు ఎంపీ కాలేదా, గవర్నర్ కాలేదా అని బీజేపీ ఆశావహులు అంటున్నారు.. ఏమో.. గుర్రం ఎగరావచ్చు కదా!