రాజకీయ వ్యూహకర్తగా పేరు మోసిన ప్రశాంత్ కిశోర్ మాటలకు ఏ విలువ కూడా ఉండదని తెలిసిపోతోంది. ఒక రకంగా ఆయనను కిరాయి మేధావి అంటుంటారు. ఆయన మాటల్లో నిజాయితీ లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల కోసం ఆయన పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోతారని చెప్పడం వెనక కూడా అదే ఉందని అనుకోవాల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోతారని గతంలో ఓసారి ప్రశాంత్ కిశోర్ చెప్పారు. కానీ నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారు. తెలంగాణలో కేసీఆర్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం కూడా తప్పయింది, జగన్పై ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గాలిలో కలిసిపోయేవేనని భావించవచ్చు.
అంతేకాదు, వైఎస్ జగన్ పేదలకు తాయిలాలు ఇస్తూ మూలధన పెట్టుబడి, మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికి వదిలేశారని ప్రశాంత్ కిశోర్ ఓ తప్పుడు వ్యాఖ్య చేశారు. వైఎస్ జగన్ సంక్షేమాన్ని అందిస్తూనే అభివృద్ధికి కూడా పునాదులు వేశారు. ఆంధ్ర తూర్పు తీరంలో ఓడరేవులు రూపుదిద్దుకుంటున్న విషయం ఆయన గుర్తించినట్లు లేరు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్న విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. మౌలిక వసతుల కల్పన కూడా ఏ మేరకు జరుగుతుందనేది ప్రభుత్వ కార్యక్రమాలను అధ్యయనం చేస్తే తెలిసి ఉండేది.
సంక్షేమ పథకాలను ప్రశాంత్ కిశోర్ తప్పు పడుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా పేదలకు మేలు ఎలా జరుగుతుందనేది ఆయన ఆలోచించినట్లు లేదు. సంక్షేమ పథకాలను ఇలా అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అన్నారు. సరే, చంద్రబాబు నాయుడు జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఆయన అధికారంలోకి వస్తే వాటిని ఎలా అమలు చేస్తారు? అప్పులు చేయకుండా ఆయన వాటిని అమలు చేయగలరా? నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే స్పష్టత ఇవ్వగలరా? ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి? నిజానికి, చంద్రబాబు హామీలు ఇచ్చి మరిచిపోతారు. పాలకులంతా అలా చేయాలని ప్రశాంత్ కిశోర్ కోరుకుంటున్నారా?
సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుందే తప్ప ప్రభుత్వం ఇచ్చే వేయి రూపాయల లబ్ధి కోసం కాదని కూడా ప్రశాంత్ కిశోర్ అన్నారు. జగన్ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన నోటి నుంచి ఓ తప్పుడు మాట రావడం వెనక ఎవరున్నారు? జగన్ ప్రభుత్వం మొత్తం 6 లక్షల 32 వేల ఉద్యోగాలు ఇచ్చిందనే విషయాన్ని ఆయన ఎందుకు మరిచిపోయారు, ఎవరి కోసం మరిచిపోయారు? తాను కొమ్ము కాస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? కేవలం 34 వేలు. అటువంటి చంద్రబాబును యువత నమ్ముతుందా?
ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఓడ రేవుల వల్ల ఉద్యోగాల కల్పన జరగదా? రాష్ట్రంలోకి గతంలో కన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. వివిధ కార్పోరేట్ సంస్థలు రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి. చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా ఎక్కువగా ఈ దిశలో రాష్ట్రం ప్రస్తుతం ముందడుగు వేసింది.
ప్రజల సొమ్ము పంచడానికి మీరెవరని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు రూపుకల్పన చేసే సమయంలో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా? చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రకటించకుండానే ఎన్నికలను ఎదుర్కుంటారా? ఒకవేళ చచ్చీచెడి అధికారంలోకి వస్తే ఆయన ఎవరి సొమ్ము పంచుతారు? ఈ ప్రశ్నకు ప్రశాంత్ కిశోర్ ఇచ్చే సమాధానం ఏమిటి? చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ వింతగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రశాంత్ కిశోర్ విశ్వసనీయత కోల్పోయారు. తాజా పరిణామాలతో ఆయన మరింతగా విశ్వసనీయతను కోల్పోయే అవకాశం ఉంది.