తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు కాలం కలిసిరావట్లేదు. నిన్నటి వరకు అధికారం అనుభవించిన నేతలు, గత ఎన్నికల్లో టికెట్లు దక్కకపోయినా అధికారంలోకి వస్తే ఏదో ఒకటి అడగొచ్చులే అనుకున్న నాయకులూ.. ఇప్పుడు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి కమలం కండువా కప్పుకొన్నారు.
మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు
మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడెం నగేష్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ రోజు బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లి తరుణ్ ఛుగ్ సమక్షంలో కమలదళంలో చేరిపోయారు.
ఇప్పటికే డిసైడయిపోయారు..
ఈ రోజు బీజేపీలో చేరిన నేతలంతా పార్టీని వీడతారని బీఆర్ఎస్ ఇప్పటికే డిసైడైపోయింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు, మొన్నటి బీఆర్ఎస్ జాబితాలో ఎంపీ టికెట్ దక్కని సీనియర్లు, ప్రస్తుత సిటింగ్ ఎంపీలతో కమలనాథులు నిత్యం టచ్లో ఉంటున్నారు. పార్టీలోకి వస్తే ఎంపీ టికెటిస్తామని చెబుతున్నారు. దీంతో చాలామంది బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ వైపు చూస్తున్నారని గులాబీ పార్టీ అధినాయకత్వానికి తెలుసు.