జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలో ఒక పాపులర్ డైలాగుంది. అదేమిటంటే ‘నాకు తిక్కుంది.. కాని దానికో లెక్కుంది’ అని. అయితే సినిమాలో చెప్పే డైలాగులు చెల్లిపోతాయి కానీ నిజ జీవితంలో కూడా అలాగే వ్యవహరిస్తే జనాలకు తిక్క మాత్రమే కనబడుతుంది కానీ లెక్కేమీ కనబడదు. ఇప్పుడు పవన్ వ్యవహారం అలాగే ఉంది. పవన్ – చంద్రబాబు.. ఇద్దరిలో ఎవరి అవసరం ఎవరికుంది? అన్న ప్రశ్న కీలకమైంది. పవన్‌కు చంద్రబాబుతో ఏం అవసరంలేదు. అవసరమంతా చంద్రబాబుదే. కాబట్టి చంద్రబాబుకే పవన్‌తో చాలా అవసరముంది.
అయితే కారణాలు తెలియదుకాని చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నపుడు పవన్ జైలుకెళ్ళి మాట్లాడి మరీ మద్దతు ప్రకటించారు. అంటే టీడీపీనే పవన్ కాళ్ళబేరానికి వస్తుందని అందరు అనుకుంటుంటే పవనే తనంతట తానుగా చంద్రబాబు దగ్గరకు వెళ్ళి మద్దతు ప్రకటించటంలో తిక్క కనబడుతోందా లేకపోతే లెకేమన్నా ఉందా? ఇక టీడీపీకి బీజేపీతో పొత్తు కుదర్చటంలో కూడా పవన్ తిక్కే కనబడుతోంది. ఎందుకంటే నిజానికి బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవటం చంద్రబాబుకే అవసరం కాని పవన్‌కు కాదు. కానీ బీజేపీ పెద్దలతో చివాట్లు తిని చంద్రబాబుతో పొత్తు కుదర్చటంలో కూడా తిక్కే కనబడుతోంది లెక్కేమీ తెలియటం లేదు.
ఇక సీట్ల సర్దుబాటు సందర్భంగా మొత్తం సీట్లలో మూడో వంతు(58) తీసుకుంటామని స్వయంగా పార్టీ ఆఫీసులో పవనే ప్రకటించారు. కానీ తీసుకున్నది 24 మాత్రమే. ఒకటి చెప్పి మరొటి చేయటానికి కారణం తిక్కేనా లేకపోతే లెక్క కూడా ఉందా అన్నదే తెలియదు. అయితే మధ్యలో బీజేపీ కూడా పొత్తులోకి రావటంతో అంతకుముందు తీసుకున్న 24 సీట్లకు పవన్ మూడు సీట్లకు బొక్కపడింది. 151 సీట్లకు పోటీ చేస్తున్న టీడీపీ నుండి బీజేపీకి సీట్లు కేటాయించకుండా చంద్రబాబు జనసేనకు మూడు సీట్లను బొక్కపెట్టడంలో పవన్ తిక్కే కనబడుతోంది.
పవన్‌తో సమస్య ఏమిటంటే సినిమా జీవితం, సినిమా డైలాగులు వేరు వాస్తవ జీవితం వేరన్న విషయాన్ని గ్రహించలేపోతున్నారు. సినిమా షూటింగ్‌ల్లో ఎలాంటి డైలాగులు చెప్పినా చెల్లిపోతుంది ఎందుకంటే పవన్‌కు ఎదురు చెప్పేవారుండరు. కానీ రాజకీయాల్లో పవన్‌కు అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లే. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ రూపంలో అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అయినా వాస్తవం ఏమిటో గ్రహించుకోలేక తిక్క..లెక్కంటు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.