ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. తమ పార్టీలో టికెట్ దక్కనివారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. టికెట్ దక్కకపోయినా పర్లేదు.. మా పార్టీకి నా వాల్యూ తెలియాలి అని పక్క పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు మరికొందరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేన కీలక నేతలను కలవడం హాట్‌టాపిక్‌గా మారింది.
మనోహర్, బాలశౌరితో భేటీ
టీడీపీ విడుదల చేసిన రెండు లిస్టుల్లోనూ వంగవీటి రాధా పేరు లేదు. మరోవైపు జనసేన పొత్తులో తమకు దక్కిన అవనిగడ్డ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో రాధా జనసేన మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి బాలశౌరితో ఆయన నివాసంలో భేటీ కావడం, వీరిద్దరూ గంటపాటు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు రాధా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి కూడా మాట్లాడారు.
జనసేనలో చేరతారని ముమ్మర ప్రచారం
కాపు నేతగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పేరు ప్రఖ్యాతలున్న వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఆ సామాజికవర్గం ఓట్లనే నమ్ముకున్న జనసేనలో చేరతారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. రాధా ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఆయన అత్తామామలు కూడా జనసేనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం, ఆయన తాజాగా బాలశౌరి, మనోహర్‌లను కలవడం జనసేనలో రాధా చేరికకు రూట్ క్లియర్ అవుతున్నట్లే కనిపిస్తోంది. రాధా జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.