విశాఖ పోర్టులో పట్టుబడిన మాదకద్రవ్యాల సంఘటనపై విశాఖపట్నం పోలీసు కమిషనర్(సీపీ) రవిశంకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో పెద్ద ఎత్తున పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి హడావిడి చేశారని, కంటెయినర్ తెరవకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వార్తా కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దని సూచించారు.
సీబీఐ పిలిస్తేనే తాము అక్కడికి వెళ్లామని, తమపై ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ కేసును సీబీఐ పర్యవేక్షిస్తోందని, సీబీఐ నుంచి తమకు కాల్ వచ్చిందని, వారు డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారని, తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారని, కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లారని ఆయన చెప్పారు.
సీబీఐ కోరిక మేరకే పోలీసులు అక్కడికి వెళ్లారని, విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదని, తాము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నామని, విధి నిర్వహణలో తమను ఎవరూ ఒత్తిడి చేయలేరని, ఏపీ పోలీసులపై సీబీఐ ఏ విధమైన ఆరోపణలు కూడా చేయలేదని ఆయన వివరించారు.
తమ పరిధిలో లేని ప్రైవేట్ పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లామని, వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదని, కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారని రవిశంకర్ అన్నారు.
స్థానిక అధికారుల వల్ల ఆలస్యం జరిగిందని చెప్పడం సాంకేతికరమైన పదజాలం మాత్రమేనని ఆయన అన్నారు. తాము ఎన్డీపీఎస్ మీద ఉక్కుపాదం మోపుతున్నామని, విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నామని, గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నామని, గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నామని చెప్పారు.