పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా మరో పార్టీ కార్యాలయం మూతపడింది. దాదాపు నెల క్రితం విశాఖపట్నంలోని మాధవదార పార్టీ కార్యాలయం మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడులోని జనసేన కార్యాలయం మూతపడుతోంది.
పార్టీకి శాశ్వత కార్యాలయాలు అవసరం లేదని జనసేనకు చెందిన కొందరు నాయకులు వాదిస్తున్నారు. కార్యాలయాల కన్నా కూటమి సజావుగా సాగడం అవసరమని అంటున్నారు. నిజానికి, తీవ్రమైన అసంతృప్తి కారణంగానే జనసేన కార్యాలయాలు మూతపడుతున్నాయి.
తమకు ప్రత్యేకమైన ఉనికి లేదని, టీడీపీ సైకిల్ గుర్తుతో జనసేన కార్యకర్తలు తమ ఉనికిని ప్రదర్శించుకుంటున్నారని, అందువల్ల తమకు ప్రత్యేకంగా కార్యాలయాలు అవసరం లేదని వారు వాదిస్తున్నారు. కానీ, పవన్ కల్యాణ్ వైఖరి పట్ల పలు నియోజకవర్గాల్లో తీవ్రమైన అసమ్మతి చోటు చేసుకుంది. దాంతో జనసేన కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.