విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన ఎందుకు తన చేతుల్లోకి తీసుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ఒక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మాటలను బట్టి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎందుకు అలా వ్యవహరించారనేది అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రణాళికాబద్దంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల డయాఫ్రమ్‌వాల్ దెబ్బ తింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పిల్ వే, స్పిల్ ఛానెల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి, ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును 2013 – 14 ధరల ప్రకారమే పూర్తి చేస్తామని 2016 సెప్టెంబర్ 7వ తేదీన నాటి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం నిర్మాణానికి అయ్యే రూ.20,398.61 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. 2014 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో రూ.15,146.27 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మిగిలింది రూ.521.63 కోట్లు మాత్రమే.
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చు రూ.33,168.23 కోట్లు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ 2017-18 ధరల ప్రకారం సీడబ్ల్యుసీ ఖరారు చేసి సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి నిధులను విడుదల చేసి, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని మోదీతో సమావేశమైన ప్రతిసారీ కోరుతున్నారు. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తోంది.
గోదావరి నది వరదను మళ్లించే విధంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానెల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసిన తర్వాతనే ప్రధానమైన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలి. కానీ కమీషన్ల కోసం చంద్రబాబు వరద మళ్లింపు పనులను పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ పనులను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలకు నామినేషన్‌పై సబ్ కాంట్రాక్టుగా అప్పగించారు. పనులు చేసిన సంస్థలకు రూ.400 కోట్ల బిల్లులు చెల్లించి తన పని కానిచ్చేసుకున్నారు.
అనంతరం రూ.2,917 కోట్ల విలువైన పనులను చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్‌పై కట్టబెట్టారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. అయితే, పునరావాసం కల్పించే పనులను పక్కన పెట్టేసి కాఫర్ డ్యామ్‌ల్లో ఖాళీలు పెట్టి, ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకమే. 2019, 2020ల్లో గోదావరి వరద కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఒత్తిడితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బ తింది. దీనికి చంద్రబాబు తప్పిదమే కారణమని హైదరాబాద్ ఐఐటి నివేదిక ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తప్పిదాలన్నీ చేసిన చంద్రబాబు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌పైకి నెట్టేశారు. చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దడమే పెద్ద వ్యవహారం కాగా, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా జగన్ మీద పడింది.