తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమపై ఎప్పుడూ లేని ప్రేమను చూపిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల రాయలసీమ ప్రాంతాలలో పర్యటించారు. ఇక అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు గోదావరి నీటిని తీసుకొచ్చి రైతన్నలకు సాగునీటిని అందిస్తానని హామీలు ఇచ్చారు.
ఇప్పటికే చంద్రబాబు అంటేనే మాట మీద నిలబడే వ్యక్తి కాదని.. నిన్ను నమ్మం బాబు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినప్పటికీ అలాంటి దొంగ హామీలను ఇస్తూ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నీటి ప్రాజెక్టుల విషయంపై ఈయన శ్రద్ధ పెట్టింది లేదు.
ముఖ్యంగా సీమ జిల్లాలకు నీటిని అందించాలన్న ఆత్రుత చంద్రబాబులో ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన జరగగా చంద్రబాబు హయామంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ తానే పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున నిధులు అందుకున్నటువంటి చంద్రబాబు ఆ నిధులను పక్కకు మళ్లించుకుని పోలవరాన్ని గాలికి వదిలేశారు. ఇలా పోలవరం పూర్తి చేయలేనటువంటి ఈయన రాయలసీమకు గోదావరి నీటిని ఎలా తెస్తారన్న ప్రశ్న ప్రతి ఒక్క సీమ రైతులలోనూ ఉంది. 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజల దాహార్తిని కూడా తీర్చలేని పాలన చంద్రబాబుది. ఇలా సొంత నియోజకవర్గానికే తాగునీరు అందించలేని చంద్రబాబు ఏకంగా సీమకు గోదావరి నీటిని ఎలా తీసుకొస్తారు. ఇలాంటి మాటలు అన్ని కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసమే దొంగ హామీలు ఇస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.