ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. పెత్తందారీతనంతో ఆయన మదమెక్కి కొట్టుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబు శింగనమల వైసీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులును బహిరంగంగా హేళన చేసి మాట్లాడటంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చారంటూ చంద్రబాబు హేళన చేయడంపై మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం సాధారణ వ్యక్తులను సైతం అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే చంద్రబాబు అతడిని ఒక టిప్పర్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటు ఇస్తారా అంటూ హేళన చేయడమేంటని నిలదీశారు. అంతేకాకుండా వేలిముద్ర వేసేవాళ్లను పెట్టారంటూ హేళన చేస్తున్న చంద్రబాబు ముఖాన దళిత వర్గాలు ఉమ్మేసే రోజులు దగ్గరపడ్డాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను తోకలు కత్తిరిస్తానని, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేశారని, ఇప్పుడు తాజాగా ఒక దళితుడిని ఉద్దేశించి టిప్పర్ డ్రైవర్‌కి సీటు ఇస్తారా అని బహిరంగ సభలో అతని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం దుర్మార్గమని కారుమూరి దుయ్యబట్టారు. చంద్రబాబు మాదిరిగా కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకునే నాయకుడు కాదని, సామాన్యులను సైతం అసెంబ్లీకి పంపించాలనే సంకల్పంతో జగన్ ఉన్నారని ఆయన తెలిపారు. దళితులు, బీసీలను టార్గెట్ చేసి రాజకీయ పబ్బం గడుపుకొనే చంద్రబాబుది కూడా ఒక బతుకేనా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే దళిత వర్గాలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కారుమూరి డిమాండ్ చేశారు.