చంద్రబాబు, ఆయన టీమ్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న తీరును ఓటర్లు గమనిస్తూనే ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు, ఆయన వందిమాగధులకు చెంపదెప్పలు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం సాయంత్రం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకటో తేదీ వచ్చిందంటే వలంటీర్ వేకువజామున వచ్చి పెన్షన్ ఇస్తారని వేచి చూసే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు చంద్రబాబు, ఆయనకు అంటకాగుతున్న టీమ్ కుట్రపూరిత దుశ్చర్యలతో నిరాశ ఎదురైందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది పింఛనుదారులను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఈనాడు రామోజీరావు కలిసి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం వృద్ధులను ఎంతలా ఇబ్బందులకు గురిచేశారో అదే మాదిరి మళ్లీ చేయాలని నీచ రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
చంద్రబాబుకు బంటు లాంటి నిమ్మగడ్డ రమేష్ ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు చంద్రబాబు తొత్తులాగా నిమ్మగడ్డ పనిచేసి కరోనా లేనప్పుడు ఉందని ఎన్నికల విషయంలో ఆటంకాలు కల్పించారని మంత్రి విమర్శించారు. వాళ్లు చేస్తున్న ద్రోహాలను ప్రజలు గమనిస్తున్నారని, వాటికి పర్యవసానంగా మే 13న తీర్పు ఇవ్వనున్నారని స్పష్టం చేశారు.