రాష్ట్రంలోని 65 లక్షల మంది పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు అండ్ కోకి వాళ్లందరి ఉసురు తగిలి తీరుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదోళ్ల ఉసురు పోసుకుని నువ్వేమి బాగుపడతావ్ అని ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే అసహ్యం వేస్తోందన్నారు. వలంటీర్ల వ్యవస్థ విచ్ఛిన్నమే చంద్రబాబు ప్రయత్నమని ఆయన మండిపడ్డారు. 55 నెలలుగా వలంటీర్ల ద్వారా సీఎం వైఎస్ జగనే పింఛన్లు పంపిస్తున్న సంగతి ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వలంటీర్ల వ్యవస్థ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పైరవీ చేసింది ఆయన వదిన పురందేశ్వరేనని పేర్ని నాని చెప్పారు. గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే ఢిల్లీ ప్లీడర్లను పెట్టుకొని ఈ వలంటీర్ వ్యవస్థను నిలువరించడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబేనని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, పురందేశ్వరి ఎవరో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వలంటీర్లను పక్కన పెట్టండి అనగానే వీళ్లంతా సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఈ విషయం ప్రజలకు తెలిసి తిరుగుబాటు వచ్చేసిందని తెలిసి.. ఇప్పుడు తలుపు సందులో తోక పడ్డ కోతిలా చంద్రబాబు తన్నుకులాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 65 లక్షల మంది పెన్షనర్లు కైమా కొట్టేస్తారని బాబు ఆండ్ కోకు కంగారు పుట్టిందన్నారు. చంద్రబాబు విషం చిమ్మి రెండు నెలలు పింఛన్ ఆపితే సీఎం జగన్‌పై వ్యతిరేకత వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ అంటేనే నమ్మకమని, చంద్రబాబు అంటే అబద్ధమని అందరికీ తెలుసన్నారు.
భీమవరంలో పవన్ ఇల్లు కట్టారా?
పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్.. అక్కడే ఇల్లు కట్టుకుంటానని అంటున్నారని, మరి గతంలో భీమవరంలో పోటీ చేసినప్పుడు అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పిన పవన్.. అక్కడ కట్టారా అని పేర్ని నాని ప్రశ్నించారు. జలుబు చేస్తే మాత్రం మందేసుకోడానికి హైదరాబాద్ వెళ్తారని, అలాంటి పవన్‌ని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 2014 నుంచి నిఖార్సుగా జనసేన జెండా మోస్తున్న ఎంత మందికి పవన్ టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. లోకేశ్ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు.. నాకు రాలేదే అని పవన్ బ్లేడ్ దాడి నాటకం ఆడారని పేర్ని నాని ధ్వజమెత్తారు.