ఈడ్చికొట్టిన ఈసీ.. ఇదీ.. ఇవాళ్టి ఈనాడు ప్రధాన పత్రికలో ప్రచురితమైన ప్రధాన వార్త శీర్షిక. ఓ రాజ్యాంగబద్ధ సంస్థ.. అదే రాజ్యాంగానుసారం అఖిల భారత సర్వీసు అధికారులను ఈడ్చి కొట్టిందటా.. ఇదీ పాత్రికేయ విలువల గురించి ప్రపంచానికి గురువింద పాఠాలు చెబుతున్నామని ఫీలయ్యే సీనియర్ మోస్ట్ సర్కులేటెడ్ డైలీ ఈనాడు రాసిన రాత.
అఖిల భారత సర్వీసు అధికారులమనే ఇంగితం ఆ అధికారులు మరిచారు సరే.. ఆ అఖిల భారత సర్వీసుకు ఉన్న విలువేంటో మీకైనా తెలుసా.. ఆ అఖిల భారత సర్వీసుకు సైతం అగ్రంగా ఉన్న ఎన్నికల సంఘంకు ఉన్న స్థాయేంటో మీకు ఇంగితం ఉందా..? ఇప్పుడు సర్వీసులు, విలువల గురించి మాట్లాడుతున్న మీరు.. 1995 నుంచి 1999 దాకా.. 1999 నుంచి 2004 దాకా… తిరిగి 2014 నుంచి 2019 దాకా ఆ అఖిల భారత సర్వీసు అధికారులే ఎలా పనిచేశారో సోయి ఉందా..?
ముగ్గుర్నీ కాదని డీజీగా..?
2014 తర్వాత అన్నీ కోల్పోయి ఒంటరిగా నిలబడిన రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చడానికి అదే అఖిల భారత సర్వీసు అధికారులను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నాడో గుర్తుందా..? ఎవరు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, డీజీపీ, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలకు ఎస్పీలు, కలెక్టర్లు. నాటి ప్రభుత్వంలో అప్పటి ఇన్‌ఛార్జి డీజీగా ఉన్న సాంబశివరావు కంటే అదే డీజీ ర్యాంకులో ఉన్న మరో ముగ్గురు సీనియర్ అధికారులను సైతం పక్కన పెట్టి కేవలం సామాజిక వర్గ ప్రాతినిధ్యం కోసం పోలీస్ బాస్ సీటు కట్టబెట్టలేదా..? తిరిగి అదేస్థానంలో పూర్తిస్థాయి డీజీ కోసం ఓ 1985 బ్యాచ్ అధికారి నుంచి ముడుపులు ముట్టడమే గాక.. ఓ ఇద్దరు కీలక కుల నాయకుల నుంచి ఒత్తిళ్లు రాలేదా..? అప్పుడెక్కడుంది మీరు చెప్పే విలువ..?
ఈసీలోనూ కులమేగా బాబూ..
ఈ దేశ రాష్ట్రపతి కంటేనూ ఎక్కువ శక్తిమంతం ఎన్నికల సంఘం. న్యాయ వ్యవస్థకు మినహాయించి ఎక్కడా తలొగ్గే పరిస్థితి లేని ఈ రాజ్యాంగబద్ధ సంస్థతోనూ మీ కుల కుటిల రాజకీయాలు నిజం కాదా..?
నిబంధనలకు తిలోదకాలిస్తూ మీ కుల వ్యక్తికి ఆ సంస్థలో కీలక పదవి కట్టబెట్టి మీ స్వప్రయోజనాల కోసం వాడుకున్నది నిజం కాదా..? నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల మీద ఆ సదరు అధికారితో కుట్రలు పన్నింది వాస్తవం కాదా..? ఆయన్ని పక్కనపెట్టడం అంటే ఈడ్చి కొట్టడమేనా ఈనాడు..?
దీనికి సమాధానం ఎవరు చెబుతారు..? ఈనాడులో జిల్లా స్థాయి రిపోర్టర్ అంటే కలెక్టర్‌తో సమానమని చెప్పే ఎడిటర్ ఎమ్‌ఎన్‌ఆర్ చెప్పాలా..? లేక ఆ వయసులో బాబు పల్లకి, ఈ వయసులో బుల్లబ్బాయిని పల్లకి ఎక్కించేందుకు తహతహలాడుతున్న మీడియా మొఘల్ చక్రవర్తి చెప్పాలా..?
ఈనాడుపై పరువునష్టం..?
తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రధాన పత్రికలో వార్త ప్రచురించిన ఈనాడుపై పరువు నష్టం దావా వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అఖిల భారత సర్వీసును, ఎన్నికల సంఘాలను సైతం అవహేళన చేస్తూ రాసిన కట్టుకథలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందేనని ఆ సంస్థలకూ వినతులొస్తున్నాయి.