తన స్వార్థం తప్ప మరోటి ఆలోచించని వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు వారి విషయంలో ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందుకే ఇప్పుడు పింఛన్లు అందుకునేందుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నానా అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు.
గురువారం మధ్యాహ్నం గుంటూరులో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఆయన స్వార్థపూరిత ఆలోచనల వల్ల వృద్ధులను ఎండల్లో ఇబ్బందులు పడేలా చేశారని, చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయని ఆయన చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై, టీడీపీపై వచ్చిన వ్యతిరేకతను చూసి కంగారుపడుతున్న చంద్రబాబు, టీడీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమిటనేది ప్రజలకు తెలుసని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేదని ఆయన చెప్పారు. కానీ, ఇప్పుడు రెండోరోజుకి కూడా 60 శాతం పంపిణీ మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు చంద్రబాబుపై, టీడీపీపై కోపంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదని, ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచనని ఆయన చెప్పారు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారని అన్నారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారని, రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం కచ్చితంగా చెబుతారని సజ్జల చెప్పారు.