బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పట్ల మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ… తన మరిది చంద్రబాబు నాయుడి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరితెగించేశారు. ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసి వారిపై చర్యలు తీసుకోవడానికి పురందేశ్వరి కారణం అయ్యారు.
ఈమె బీజేపీలో ఉండడంతో బీజేపీ చెప్పినట్టుగానే అధికార యంత్రాంగం మొత్తం నడుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తన వదినను అడ్డుగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరి పట్ల ఎన్నికల అధికారులు చర్యలు తీసుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఎవరిని నియమించాలి అనే విషయాలను కూడా పురందేశ్వరి చెప్పటం గమనార్హం. ఇలా పురందేశ్వరి చేసినటువంటి ఈ వ్యవహారంపై మంత్రి పేర్ని నాని స్పందించారు.
తన మరిది చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అనవసరంగా అన్యాయంగా 22 మంది అధికారులపై వేటు వేసేలా పురందేశ్వరి చేశారని ఆయన మండిపడ్డారు. తన మరిదికి లాభం చేకూరేలా పురందేశ్వరి శిఖండి పాత్రను పోషిస్తుందని, ఆంధ్ర బీజేపీలోకి, తెలుగు దొంగలు పడ్డారంటూ ఈ సందర్భంగా నాని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పురందేశ్వరి ఎన్నికల సంఘానికి ఈ విధమైనటువంటి లేఖ రాయడంతో ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి తప్పుడు లేఖలను పరిగణలోకి తీసుకొని ఎలా వారిపై వేటు వేసింది అంటూ ప్రశ్నించారు. పురందేశ్వరి ఇలాంటి లెటర్ రాయగానే వారి నుంచి వివరణ కోరుతూ ఒక్క లెటర్ అయినా ఎలక్షన్ కమిషన్ పంపించాలి కదా.. అలాకాకుండా అన్యాయంగా అధికారులపై వేటు వేసేలా చేసినటువంటి పురందేశ్వరిని జైల్లో పెట్టాలి అంటూ పేర్ని నాని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.