జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన వ్యవహారశైలి అదే రీతిలో ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను నిందించారు. బీజేపీతో అంటకాగుతూ కేంద్రాన్ని మాత్రం ఒక్క మాట కూడా అనలేకపోయారు. కేంద్రాన్ని విమర్శించాలంటే ఆయనకు కాళ్లూ చేతులూ వణుకుతాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమేనని ఆయన అసలు విషయం కాస్తా అందంగా చెప్పారు. గతంలో తాను స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ప్రధాని మోదీని కలిసేందుకు తనతో ఎవరొస్తారో చేతులెత్తండి అని అడిగితే ఎవరూ స్పందించలేదట. చంద్రబాబుతో పొత్తు కుదర్చడానికి బీజేపీ పెద్దల తిట్లు తిన్న ఆయన, వారికి వంగి వంగి దండాలు పెట్టిన పవన్ కల్యాణ్.. స్టీల్ ప్లాంట్ కోసం మాత్రం ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే, ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. స్వార్థ ప్రయోజనం, చంద్రబాబు ప్రయోజనం కావాలి. పవన్ కల్యాణ్ చెత్త వైఖరిని ప్రజలు గమనించరా? తప్పకుండా గమనిస్తారు. తగిన బుద్ధి కూడా చెప్తారు.
ఇంకో మాట కూడా ఆయనగారు సెలవిచ్చారు. అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి తమకు మద్దతు రాలేదని, లేదంటే ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణను నిలిపివేసేవాడినని అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీని ఊరికే నిందిస్తే సరికాదని ఆయన అంటున్నారు. ఈ మాటలు అనకపోతే పవన్ కల్యాణ్ మర్యాద కాస్తా అన్నా దక్కి ఉండేది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన ఎందుకు వచ్చిందో తెలుసుకోలేని తెలివితక్కువ తనం ఆయనను పట్టిపీడిస్తోంది. సినిమాల్లో మాదిరిగా డైలాగ్లు చెప్తే సరిపోదు. చూస్తుంటే, పవన్ కల్యాణ్ అబద్ధాలు చెప్పడంలో గురువు చంద్రబాబును మించిపోయేట్లున్నారు.