YouTube channel subscription banner header

ఈ మార్పులను చంద్రబాబు కలలోనైనా ఊహించగలరా?

Published on

ప్రభుత్వ పాఠశాలలు ఇంతగా మారిపోతాయని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలలోనైనా ఊహించగలరా? ఆయన హ‌యాంలో నారాయణ, చైతన్య విద్యాసంస్థలకు దోచిపెట్టే ప్రణాళికలనే విద్యారంగంలో అమలు చేశారు. ఒక్కనాడు కూడా పేద పిల్లల విద్యపై మనసు పెట్టలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మారిపోవడమే కాకుండా విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలులోకి వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేయడం వల్ల పేద పిల్లలు చదువులకు దూరమయ్యారు. సరిపడినంత మంది విద్యార్థులు లేరనే కారణంతో 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 1,785 పాఠశాలలను మూసేసింది. విద్యాసంవత్సరం ముగిసే వరకు పాఠ్యపుస్తకాలను కూడా అందించలేకపోయింది. పిల్లలు బడులకు ఎందుకు రావడం లేదనే కనీసమైన ఆలోచన కూడా ఆయన చేయలేదు. పేద కుటుంబాల పిల్లలపై ఆయనకు ఏ మాత్రం పట్టింపు లేదు.

విశేషమైన అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు కాంట్రాక్టు కుదుర్చుకుంది. అదేదో ప్రభుత్వ పాఠశాలలను ఉద్ధరించడానికన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద కుటుంబాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని విద్యారంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 58 నెలల్లో రూ.73 వేల కోట్లు వెచ్చించి 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేసింది. పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేల చొప్పున జమ చేస్తూనే విద్యాసంస్కరణలను చేపట్టింది. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది.

విద్యాసంస్కరణలపై జగన్ ప్రభుత్వం 2021లో అధ్యయనం చేసింది. నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలతో ‘నాడు – నేడు’ పథకాన్ని ప్రారంభించింది. మూడో తరగతి నుంచే అత్యున్నతమైన ప్రమాణాలతో సబ్జెక్ట్ టీచర్లతో విద్యా బోధన చేపట్టింది. దాంతో 3వ తరగతి నుంచే విద్యార్థులకు బీఈడి అర్హత కలిగిన సబ్జెక్ట్ టీచర్లు బోధన చేస్తున్నారు. దానికితోడు చంద్రబాబు ప్రభుత్వం మూసివేసిన 1,785 పాఠశాలలను తిరిగి తెరిపించింది.

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గ్రామంలో అత్యంత ఆకర్షణీయంగా తరగతి గదులను తీర్చిదిద్దింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా ఎదుర్కునే విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చింది. రాష్ట్రంలో అమలు చేసిన విద్యాసంస్కరణలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి.

ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోతున్నారని, బోధనా ప్రమాణాలు కూడా తక్కువగా ఉన్నాయని, ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్ ప్రమాణాలతో ఉంటున్నారని, సిలబస్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారని, బేసిక్స్ కూడా వారికి తెలియడం లేదని పలు సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. దీంతో ప్రభుత్వం పిల్లలు వాటిని అధిగమించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది.

2021-22 విద్యా సంవత్సరం నుంచి అంగన్ వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టింది.

అంగన్ వాడీలను పీపీ-1, పీపీ -2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాటు హైస్కూళ్లలో 62 వేల ఐఎఫ్‌బీ ప్యానల్స్ డిజిటల్ విద్యాబోధనను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించడానికి టోఫెల్ శిక్షణను ప్రారంభించారు.

ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని సులభతరం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించి అందించారు. రోజుకో ఇంగ్లీష్ పదం నేర్చుకునే విధంగా దాన్ని అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని వేయి పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమలులోకి తెచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2022-24లో పదో తరగతి, ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యాసంస్థల పిల్లలే కైవసం చేసుకున్నారు. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబీ) సిల‌బ‌స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...