తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో సునీత తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు కూడా ఆమె ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసు విచారణ సాగుతుండగా అవినాష్ రెడ్డిపై హంతకుడి ముద్ర వేస్తున్నారు. హంతకుడిని పక్కన పెట్టుకుని జగన్ మాట్లడుతున్నారని ఆమె ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.
తన తండ్రి హంతకులను పట్టుకోవాలని ఓ వైపు అంటూ, వాస్తవాలు బయటకు రాకుండా సునీత కుట్రలు చేస్తున్నారు. సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేయడానికి, హత్య కేసును దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారితో కలిసి సాక్షులను బెదిరించడానికి సునీత దంపతులు చేసిన ప్రయత్నాలపై కేసులు కూడా నమోదయ్యాయి. సునీతారెడ్డి ఈ కింది ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే.
- వివేకా హత్య జరిగిన తర్వాత లభించిన లేఖను దాచిపెట్టాలని పీఏ కృష్ణారెడ్డికి సునీత దంపతులు చెప్పారా, లేదా?
- రెండో భార్య కారణంగా వైఎస్ వివేకాతో సునీత దంపతులు గొడవలు పడ్డారా, లేదా?
- వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తిలో వాటా వస్తుందనే ఉద్దేశంతో తప్పుడు సాక్ష్యం చెప్పాలని కృష్ణారెడ్డిని సునీత దంపతులు బెదిరించారా, లేదా?
- వివేకా చెక్ పవర్ తీసేసి ఆయనకు ఆర్థికంగా చిక్కులు కల్పించింది సునీత దంపతులు కాదా?
- అవినాష్ రెడ్డి పేరు చెప్పకపోతే తన భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని కృష్ణారెడ్డితో సునీత అన్నది వాస్తవం కాదా?
- వివేకానందరెడ్డిని తానే నరికానని చెప్పుకున్న దస్తగిరి బెయిల్ కు సునీత సహకరించారా, లేదా?
- వివేకా హత్య తర్వాత ప్రకటనలు చేస్తున్నవారు వివేకా రెండో పెళ్లి గురించి, ఆస్తుల సెటిల్ మెంట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
- వివేకా హత్య తర్వాత ఆస్తులన్నీ హడివిడిగా సునీత దంపతులు తమ పేర్ల మీదికి ఎందుకు మార్చుకున్నారు?
వివేకానందరెడ్డి హత్య 2019 మార్చి 15వ తేదీన వెలుగు చూసింది. వివేకానంద రెడ్డి మరణించిన విషయాన్ని కృష్ణారెడ్డి తొలుత నర్రెడ్డి రాజశేఖర రెడ్డికే చెప్పారు. ఆయన ఉదయం 6 గంటల 18 నిమిషాలకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రక్తం మడుగులో పడి ఉన్న శవాన్ని, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనాయతుల్లా తన సెల్ ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి వాట్సప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాష్ రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు చెప్పారు.
వివేకా రాసిన లేఖను, ఆయన సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు. వారంతా పులివెందులకు చేరుకున్న తర్వాత సెల్ ఫోన్ లోని మెసేజ్ లను, ఇతర వివరాలను డిలీట్ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే విమర్శ ఉంది. దాచిపెట్టిన వివేకా లేఖ బయటకు వస్తే కేసు దాదాపు కొలిక్కి వస్తుంది.
తాను వివేకాను హత్య చేశానని చెప్పిన దస్తగిరి బెయిల్‌కు సునీత సహకరించారు. అప్రూవర్‌గా మారడానికి ముందే దస్తగిరి వేసిన బెయిల్ పిటిషన్‌ను సునీత ఎందుకు వ్యతిరేకించలేదనేది కీలకమైన ప్రశ్న. దస్తగిరిని సునీత పల్లెత్తు మాట కూడా అనడం లేదు.
సునీతారెడ్డి ప్రస్తుతం జగన్ మీద చేస్తున్న విమర్శల వెనక రాజకీయాలున్నాయనేది స్పష్టం. ఆమె మీడియా సమావేశంలో ఎవరెవరికి ధన్యవాదాలు తెలిపారనే విషయాన్ని గుర్తు చేసుకుంటే చాలు, అన్నీ అర్థమవుతాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమెకు మద్దతు ప్రకటించడం వెనక మతలబు ఏమిటనేది కూడా ఆలోచించాల్సిన విషయం.