లోకసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు అంటే జూన్ 2వ తేదీన ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద ఉన్న హక్కును ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోతారు. ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న హక్కును టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోలేకపోయారు. ఓటుకు నోటు కేసుకు భయపడి ఆయన అమరావతి రాజధాని అంటూ హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించారు. రాజధాని పేరుతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రాణం పోసి తనవారికి ప్రయోజనం కలిగించే ప్రయత్నాలు చేశారు. కానీ వాస్తవ రూపంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో తాత్కాలికంగా కేటాయించిన రాజధానిని చంద్రబాబు కాలదన్నుకున్నారు. దాంతో పదేళ్లు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడిపారు.
రాజధాని విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది విభిన్నమైన మార్గం. మూడు రాజధానుల వైఖరిని తీసుకున్నారు. ఆయన ఆలోచన మేరకు విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పడాలి. అయితే, కోర్టు కేసుల కారణంగా అది ఇప్పటి వరకు జరగలేదు. దీంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ప్రతిపక్షాలు జగన్ పై విమర్శలు చేస్తున్నాయి. రాజధాని లేకపోవడం వల్ల ఏమైనా ఆగిపోయాయా అని ప్రశ్నిస్తే ఏమీ లేదు. గట్టిగా స్థిరపడిన రాష్ట్రాల్లో మాదిరిగానే కేంద్ర – రాష్ట్రాల మధ్య సాగే ప్రభుత్వ శాఖల పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సక్రమంగానే సాగాయి. కేంద్రానికి చెల్లించే పన్నుల విషయంలోనే కాకుండా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధనలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిన ‘జీ-20‘ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ సమావేశం వంటి అంతర్జాతీయ సమావేశాలు విశాఖపట్నంలో విజయవంతంగా జరిగాయి. అటువంటి కార్యక్రమాలు ప్రతిపక్షాలు చెప్పుతున్న ‘రాజధాని లేని రాష్ట్రం’లో జరిగాయి. రక్షణ శాఖ, రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అవసరమైన భూసేకరణ విషయంలో ఈ ఐదేళ్లలో ఏ విధంగానూ ఆలస్యం జరగలేదు. టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పటి కన్నా ఎక్కువగా కేంద్ర మంత్రులు జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న వారి శాఖల పనులను సమీక్షించారు, కొత్తవాటిని ప్రారంభించారు.
రాష్ట్రానికి ఈ పదేళ్ల కాలంలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనం తప్ప పూర్తి స్థాయి భవనాలతో ప్రత్యేకంగా రాజధాని లేదు. అయినప్పటికీ ఏదీ ఎక్కడా ఆగలేదు. భవనాలు మాత్రమే రాజధాని అనుకుంటే కోర్టు కేసులు పరిష్కారం కాగానే అవి ఏర్పడతాయి. రాజధాని నుంచి జరగాల్సిన పనులన్నీ రాజధాని లేకున్నా సజావుగా జరుగుతున్నాయి. అటువంటప్పుడు రాజధాని లేదనే మాట ఎందుకు? అమరావతి రాజధాని అనేది ఒక భౌగోళిక భావన మాత్రమే. దాన్ని జగన్ విశాఖలో ఏర్పాటు చేస్తానని అంటున్నారు.