చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోవడంలో దిట్ట అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల జీతం రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు తాజాగా చేసిన ప్రకటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.
తొలుత వలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేసింది చంద్రబాబేనని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. వలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది కూడా బాబేనని తెలిపారు. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా వలంటీర్ల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఫిర్యాదు చేసింది, పింఛన్ల పంపిణీ వలంటీర్ల ద్వారా చేయించొద్దని ఫిర్యాదు చేయించింది చంద్రబాబేనని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఇప్పుడు సడన్‌గా ఆయన వలంటీర్లపై ప్రేమ కురిపిస్తున్నారంటే అందుకు కారణం వలంటీర్ల ద్వారా జరుగుతున్న పింఛన్ల పంపిణీని అడ్డుకోవడంతో ఎదురవుతున్న వ్యతిరేకతను గుర్తించడం వల్లేనని చెప్పారు. రాష్ట్రంలోని 66 లక్షల మంది పింఛనుదారుల్లో చంద్రబాబుపై, టీడీపీపై ఆగ్రహావేశాలు పెల్లుబకడంతో భయపడి వలంటీర్ల విషయంలో యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. అసలు క్రెడిబిలిటీ లేని నాయకుడు చంద్రబాబు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన యూటర్న్‌లు తీసుకోవడంలో దిట్ట అని.. అనేక విషయాల్లో ఆయన యూటర్న్‌లు తీసుకున్నాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రెడిబిలిటీ లేని చంద్రబాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మరని ఆయన స్పష్టం చేశారు.